హైదరాబాద్, జూన్ 24 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌జాజు ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఆయన ఈశాన్య ప్రాంత అభివృద్ధి కార్యదర్శిగా పని చేస్తున్నారు. సంజయ్ జాజును తిరిగి తెలంగాణ రాష్టానికి పంపుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం (జూన్ 23న) కీలక నిర్ణయం తీసుకొంది. ప్రస్తుత తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారని తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ప్రధాన కార్యదర్శి రేసులో జయేశ్ రంజన్‌తో పాటు సంజయ్‌జాజ పేర్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి.. చివరకు జాజు వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. సీఎం రేవంత్ కోరిక మేరకు ఆయనను తెలంగాణకు బదిలీ చేసినట్లుగా వినిపిస్తోంది.సంజయ్ జాజు 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ సబ్‌కలెక్టర్‌గా సేవలందించారు. అంతే కాకుండా హైదరాబాద్ నగరపాలక సంస్థ (ఉఊఓఅ) అదనపు కమిషనర్‌గా, కమిషనర్‌గా, పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌గా పలు కీలక బాధ్యతలను నిర్వహించడంతో సీఎం రేవంత్ రెడ్డి.. జాజు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సంజయ్ జాజు 2014 నుంచి కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు.
సీఎస్ రామకృష్ణారావు రిటర్మెంట్ దగ్గర పడుతుండటంతో ఆ స్థానంలో కొత్త సీఎస్‌గా సంజయ్ జాజును నియమించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుందని సమాచారం. సీఎస్‌గా సంజయ్ జాజు బాధ్యతలు చేపడితే 2029 ఫిబ్రవరి వరకు సర్వీసులో కొనసాగనున్నారు.ఆగస్టు 2025లో పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణారావుకు కేంద్ర ప్రభుత్వం మొదట 7 నెలల పొడిగింపును మంజూరు చేసింది. ఆ తర్వాత మరో 3 నెలల పాటు పొడిగించింది. దాంతో ఆయన పదవీ కాలం జూన్ 30తో ముగియనుంది.కుడ్లిగి రామకృష్ణారావు 1991 క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా, ఆయనను 2025 ఏప్రిల్ 27న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఏప్రిల్ 30న బాధ్యతలు చేపట్టిన ఆయన సీఎస్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక కార్యదర్శిగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పలు హోదాల్లో పని చేసిన ఆయన పలు బడ్జెట్‌ల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.