సర్కార్ కంట్రోల్ లోకి Metro…

హైదరాబాద్, ఏప్రిల్ 27 (ఇయ్యాల తెలంగాణ) :హైదరాబాద్ మెట్రో రైల్ పై తెలంగాణ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఎల్ అండ్ టీ 100శాతం ఈక్విటీ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 30 నాటికి 15వేల కోట్ల డీల్ పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో మెట్రో ఇక సర్కార్ పరిధిలోకి వచ్చింది. నగరవాసులు ప్రధాన రవాణ వ్యవస్థ అయిన హైదరాబాద్ మెట్రోపై ఇక పూర్తి అధికారాలు సర్కార్ కే చెందనున్నాయి. మెట్రో నిర్వహణ, యాజమాన్య బదిలీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణ, నిర్వహణ బాధ్యతలను ఈ కొత్త బోర్డు పర్యవేక్షించనుంది. ఇందుకోసం జీవో నెంబర్ 128 విడుదల చేసింది.హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నూతన చైర్మన్ గా సీఎస్ రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. సర్ఫరాజ్ అహ్మద్ ను ఎండీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్లుగా జయేశ్ రంజన్, వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, డీజీపీ శివధర్ రెడ్డి, సర్ఫరాజ్ అహ్మద్, అశోక్ రెడ్డి, జితేశ్ వి పాటిల్ ను నియమించింది. మేనేజింగ్ డైరెక్టర్ గా శివేంద్ర ప్రతాప్ ను నియమించింది. మెట్రోను మరింత లాభసాటిగా మార్చడం, రెండో దశ విస్తరణ పనులను వేగవంతం చేయడంపై కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దృష్టి సారించనున్నారు.

మెట్రో నిర్వహణలో ఎల్ అండ్ టీ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, రాయితీలకు సంబంధించిన వివాదాలకు ఈ నిర్ణయంతో తెరపడనుంది.ఈక్విటీ బదిలీ ద్వారా మెట్రోపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లభించడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎల్ అండ్ టీకి సంబంధించిన 15వేల కోట్ల రూపాయల వాటాను కొనుగోలు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఐఎఫఆర్ సీ నుంచి 13వేల 615 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణంగా తీసుకోనుంది. ఈ మొత్తాన్ని 20 ఏళ్ల కాల పరిమితిలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పని చేస్తున్న పలువురు ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ట్రో పగ్గాలను చేతుల్లోకి తీసుకున్నందున, పాలనా పరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మెట్రో బోర్డును కొత్తగా పునర్వ్యవస్థీకరిస్తూ కీలక అధికారులను నియమించింది.

మెట్రో బోర్డు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ప్రభుత్వం నియమించింది. ఇన్నాళ్లూ ప్రైవేట్ యాజమాన్యం పర్యవేక్షణలో ఉన్న బోర్డు, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారుల కనుసన్నల్లో పనిచేయనుంది.  బోర్డు డైరెక్టర్లుగా రాష్టానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐటీ , పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, వికాస్ రాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిలను బోర్డు సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ విభాగానికి చెందిన ఉన్నతాధికారిని బోర్డులోకి తీసుకోవడం ద్వారా మెట్రో భద్రత , శాంతిభద్రతల పరంగా కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల మెట్రో చార్జీల నియంత్రణ, రాయితీలు,  భవిష్యత్తు పొడిగింపు పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న తరుణంలో, ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి ప్రాజెక్టును హస్తగతం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మరింత మెరుగైన రవాణా సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.      

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....