లక్ష్య సాధనకు ఆత్మ విశ్వాసమే ఆయుధం : బషీరా బేగం

హైదరాబాద్, జూలై 22 (ఇయ్యాల తెలంగాణ) :  ఆత్మవిశ్వాసం, అంకితభావం, కష్టపడి పోరాడే తత్వం ఉంటేనే జీవితంలో ఉన్నత విజయాలు సాధించగలమని మాజీ డీఎస్పీ, హైదరాబాద్ మహిళా జైలు మాజీ సూపరింటెండెంట్ బషీరా బేగం పేర్కొన్నారు. మలక్‌పేట్‌లోని డాన్ హైస్కూల్‌లో మంగళవారం “విద్యార్థినులు–ఉజ్వల భవిష్యత్తు” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం పోటీ ప్రపంచంలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారన్నారు. విద్యతో పాటు వైద్యం, ఇంజినీరింగ్, సాంకేతికత, పరిశోధన తదితర రంగాల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థినులు కూడా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు.

రాష్ట్రస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగే పోటీ పరీక్షలకు సిద్ధమై ప్రతిభను చాటాలని ఆమె పిలుపునిచ్చారు. డాన్ విద్యాసంస్థలు బాలికల విద్యకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని అభినందించిన ఆమె, తాను మహిళా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న సమయంలో మహిళా ఖైదీలతో పాటు ఉన్న ఐదేళ్లలోపు చిన్నారులకు డాన్ హైస్కూల్ ఉచితంగా విద్య అందించడం అభినందనీయమని పేర్కొంటూ సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా ఖైదీల సాధికారత కోసం చంచల్‌గూడ మహిళా జైలు ఆధ్వర్యంలో తొలిసారిగా పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు చేపట్టిన చర్యలను కూడా ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాన్ విద్యాసంస్థల చైర్మన్ ఫజల్ ఉర్ రహ్మాన్ ఖుర్రం, షజియుల్లా ఫిరాసత్, రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు, తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ ఇక్రాముల్లా హుసైనీ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....