👉 100 రోజుల్లో 185 కేసులు.. 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాల స్వాధీనం
👉 తినే అన్నంలో కల్తీలు.. తాగే పాలలో రసాయనాలు.. !
👉 చివరకు పసిబిడ్డలకు పట్టే పాలపొడిలోనూ ప్రాణాంతక పదార్థాలు!
హైదరాబాద్, జూలై 4 (ఇయ్యాల తెలంగాణ) : కేవలం లాభార్జనే పరమావధిగా సాగుతున్న నిశ్శబ్ద ముప్పుపై హైదరాబాద్ సిటీ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజారోగ్యాన్ని నిలువునా దెబ్బతీస్తూ నగరవాసుల ఆయుష్షును హరిస్తున్న కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్`ఫాస్ట్) ఏర్పాటై 100 రోజులను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న శంఖారావం పూరించిన ఈ ప్రత్యేక విభాగం.. జీహెచఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర దాడులు, ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఆహార కల్తీపై రాజీలేని సమరం సాగిస్తోంది.
ఆరోగ్యానికి గొడ్డలిపెట్టు.. ఆహార కల్తీ
ఆహార కల్తీ అనేది కేవలం ఒక చట్టపరమైన నేరమో, వ్యాపార మోసమో కాదు.. అది యావత్ సమాజంపై జరుగుతున్న నిశ్శబ్ద దాడి. పూర్వీకులు స్వచ్ఛమైన ఆహారంతో నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే, నేడు కల్తీ విషం వల్ల సగటు ఆయుష్షు సగానికి పడిపోతోంది. రసాయనాలు, నాణ్యత లేని నిల్వ పదార్థాల వాడకం వల్ల పసిబిడ్డల ఎదుగుదల దెబ్బతింటోంది. యువత, వృద్ధులు క్యాన్సర్, మÖత్రపిండాల వ్యాధులు, గుండె జబ్బుల బారిన పడుతున్నారు. దేశానికి వెన్నెముక లాంటి యువశక్తి రోగాల బారిన పడితే మానవ వనరుల ఉత్పాదకత తగ్గిపోతుంది. ఇది కుటుంబాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడమే కాకుండా, దేశ ప్రగతిని దశాబ్దాలు వెనక్కి నెడుతుంది. కల్తీ ఆహారం వల్ల చికిత్సల రూపంలో, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 310 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. అందుకే కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం పొందడం ప్రతి పౌరుడి హక్కు. ఆ హక్కును కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే హెచ్`ఫాస్ట్ నిఘా పరమావధి.
వంద రోజుల సమరంలో విస్తుపోయే నిజాలు
టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులు, సిబ్బందితో నిరంతరం పనిచేస్తున్న హెచ్`ఫాస్ట్ విభాగం.. క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కూకటివేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఈ వంద రోజుల్లో నగరవ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. జోన్ల వారీగా వివరాలు పరిశీలిస్తే.. అత్యధికంగా రాజేంద్రనగర్ జోన్‌లో 55 కేసులు నమోదు కాగా, గోల్కొండ జోన్‌లో 44, సికింద్రాబాద్ జోన్‌లో 35, చార్మినార్ జోన్‌లో 21, శంషాబాద్ జోన్‌లో 13, జూబ్లీహిల్స్ జోన్‌లో 12, ఖైరతాబాద్ జోన్‌లో 5 కేసులు నమోదయ్యాయి.
ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న స్వార్థపరులు
స్వార్థపరులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా ఆడుకుంటున్నారో స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలే స్పష్టం చేస్తున్నాయి. నిత్యం వాడే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కు సంబంధించి 27 కేసుల్లో ఏకంగా 27,024.7 కేజీల నకిలీ నిల్వలను పోలీసులు పట్టుకున్నారు. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టురట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నుల కంటే ఎక్కువ చికెన్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. వీటితో పాటు 3 కేసుల్లో 9,260 కేజీల నిల్వ పచ్చళ్లు, 4 కేసుల్లో 4,030 కేజీల కల్తీ కోవా, 7 కేసుల్లో 3,897 కేజీల నకిలీ టీ పొడి, సుమారు 15 టన్నుల నాణ్యత లేని చికెన్/మాంసం (12 కేసులు), 3,260 కేజీల కల్తీ క్రీమ్, 530 కేజీల కల్తీ నెయ్యి (1 కేసు), సుమారు 2,706 కేజీల నాణ్యత లేని డ్రై ఫ్రూట్స్/ఖర్జూరం (2 కేసులు), 2,500 కేజీల కల్తీ పెరుగు (1 కేసు), 1,514 కేజీల కల్తీ పనీర్ (5 కేసులు), ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో 120 కేజీల నాణ్యత లేని ఫ్రైడ్ చికెన్ (2 కేసులు) స్వాధీనం చేసుకున్నారు. ఐస్ క్రీములు, బిస్కెట్లు, ఆరఓ వాటర్ ప్లాంట్లు, జంక్ ఫుడ్స్ వంటి ఇతర విభాగాల్లో 34 కేసులు నమోదయ్యాయి