కాంగ్రెస్ లో యాదగిరిగుట్ట Trust బోర్డు చిచ్చు

నల్గోండ, జూలై 4 (ఇయ్యాల తెలంగాణ) : యాదాద్రి లక్క్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు నియామక వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. బుధవారం ప్రభుత్వం ప్రకటించిన ఈ బోర్డు నియామకాలు పార్టీ అంతర్గత విభేదాలను ఒక్కసారిగా రోడ్డుపైకి తెచ్చాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ నేతలను, పార్టీ సొంత క్యాడర్‌ను సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలపై గాంధీభవన్‌తో పాటు సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారం చివరకు న్యూఢిల్లీలోని పార్టీ అధిష్టానానికి అధికారిక ఫిర్యాదుల రూపంలో చేరడం గమనార్హం.ఈ నియామకాలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఒక టీవీ ఛానల్ లైవ్ లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, కీలక నేతలను కనీసం సంప్రదించకుండా ప్రభుత్వం ఈ బోర్డును ఎలా ఖరారు చేస్తుందని ఆయన బహిరంగంగానే తప్పుపట్టారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి.మరోవైపు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను సైతం ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేదనే ప్రచారం జరుగుతోంది. దేవాలయాల వ్యవహారాలతో నేరుగా సంబంధం ఉండే అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కూడా సంప్రదించకుండానే ఈ జాబితాను ఖరారు చేశారని, దేవాదాయ శాఖ మంత్రిని పక్కనబెట్టడం వల్లే ఈ వివాదం మరింత ముదిరిందని కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.

ప్రభుత్వం, పార్టీల మధ్య కనీస సమన్వయం లోపించిందనే దానికి ఈ పరిణామాలే నిదర్శనమని విమర్శకులు అంచనా వేస్తున్నారు.ట్రస్ట్ బోర్డులో వినోద్ వెంకటస్వామిని చేర్చడంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వారి కుటుంబంలో వివేక్ వెంకటస్వామికి కీలక పదవులు ఉండటం, ఆయన కొడుకు ఎంపీగా విజయం సాధించడం గమనార్హం. ఇలాంటి తరుణంలో మళ్లీ అదే కుటుంబానికి చెందిన వినోద్ వెంకటస్వామికి పవిత్రమైన యాదగిరిగుట్ట బోర్డులో స్థానం కల్పించడం ఏంటని, పార్టీ కోసం రక్తం చిందించిన ఇతర సీనియర్లను ఎందుకు విస్మరించారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, మాజీ బీఆరఎస్ ఎంపీ సోదరుడైన సత్యనారాయణ రెడ్డిని ఈ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించడంపై కాంగ్రెస్ పాతకాపులు భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులను పక్కనబెట్టి, నిన్నగాక మొన్న పార్టీ మారిన వారికి, బీఆరఎస్ నేపథ్యం ఉన్నవారికి ఇలాంటి ఉన్నతమైన, ప్రతిష్టాత్మకమైన పదవులు కట్టబెట్టడం ఏంటనే ఆవేదన పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది.మరోవైపు ప్రముఖ నటుడు చిరనీజీవి భార్య కొణిదెల సురేఖను బోర్డు మెంబర్‌గా నియమించడం రాజకీయంగా సరికొత్త వివాదానికి దారితీసింది.

ఆంధ్రప్రదేశ్‌తో బలమైన మూలాలు, సంబంధాలు ఉన్న ఆమెను తెలంగాణలోని అత్యంత పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన ఆలయ బోర్డులో ఎలా నియమిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికతను, తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా ఈ నిర్ణయం ఉందంటూ కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారేలా ఈ నియామకం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.మొత్తంగా చూస్తే, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు నియామకాల వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చే పెట్టింది. అసంతృప్త నేతలకు పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రేగిన మంటలు చల్లారేలా కనిపించడం లేదు. మరి ఈ అంతర్గత సంక్షోభాన్ని ప్రభుత్వం, పార్టీ పెద్దలు ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాలి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....