దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటక అభివృద్ధి
ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీతో కలిసి చార్మినార్, చౌమొహల్లా ప్యాలస్ ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావుతో కలిసి ఆయన చార్మినార్, చౌమొహల్లా ప్యాలస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్ తో పాటు పరిసర ప్రాంతాల్లో కలియ తిరుగుతూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా మచిలీ కమాన్ పునరుద్ధరణ కోసం ఇప్పటికే కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSDA) రూ. 3.64 కోట్లు మంజూరు చేసినట్లు
మంత్రి వెల్లడించారు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే షేర్-ఇ-బాతీల్ కమాన్ రినోవేషన్ పనులను కూడా తక్షణమే చేపట్టాలని, చార్మినార్ వద్ద ఉన్న ఫౌంటైన్‌ను పర్యాటకులను ఆకర్షించేలా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూపొందించిన నూతన పర్యాటక విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు జూపల్లి తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (PPP) పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా అటు ఆదాయం, ఇటు స్థానికులకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు.
నగర వారసత్వ సంపదపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ నగరాన్ని పర్యాటక పరంగా ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించి, నగర వారసత్వ సంపదను కాపాడుతూనే ఆధునిక హంగులు అద్దుతామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు