ఏడాదికి 10 కోట్లు ఇస్తామంటున్న సర్కార్
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ ట్రాఫిక్ ఊహించని రీతిలో పెరుగుతోంది. దాంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో నిరంతరం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా నగర ప్రజలకు పర్యావరణహితమైన, చౌకైన ప్రజారవాణాను అందుబాటులోకి తెచ్చేందుకు ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విప్లవాత్మక నిర్ణయం వల్ల సామాన్యులపై రవాణా భారం తగ్గడమే కాకుండా, నగరంపై వ్యక్తిగత వాహనాల ఒత్తిడి కూడా తగ్గుతుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.ఈ ప్రతిష్టాత్మక పథకానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, సీఎస్ రామకష్ణారావు సహా కొందరు ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో ఇప్పటికే చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా లభిస్తున్న సుమారు రూ. 10 కోట్ల వార్షిక ఆదాయాన్ని, ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. గతంలో రోజుకు 1.20 లక్షల మంది ప్రయాణించినా, ప్రస్తుతం సరైన సమయపాలన, ఫ్రీక్వెన్సీ లేకపోవడంతో ఆ సంఖ్య కేవలం 40 వేల లోపునకు పడిపోయింది. ఈ ఆదరణను తిరిగి పెంచేందుకు, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, వ్యక్తిగత వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది.హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, పురపాలక అభివద్ధి శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ దక్షిణ మధ్య రైల్వే శాఖకు రాసిన లేఖలో పలు కీలక సూచనలు చేశారు.
రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్యను పెంచడం, రైల్వే స్టేషన్లలో కనీస సౌకర్యాలను మెరుగుపరచడం వంటి అంశాలను ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంఎంటీఎస్ సర్వీసులపై ఇటీవల సవిÖక్షించారని రైల్వే జీఎంకు రాసిన లేఖలో తెలిపారు. రద్దీ వేళల్లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు పెంచాలని, స్టేషన్లలో సౌకర్యాలు మెరుగు పరచాలని కోరారు. అంతేకాకుండా, ప్రయాణికులకు ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ని అందించడానికి రైల్వే స్టేషన్ల నుండి ఇంటికి చేరుకునేలా ఆర్టీసీ షటిల్ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం స్టేషన్ ప్రాంగణాల్లో అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు.దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, ముసాయిదా ఎంవోయూ పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖకు ఇవ్వాల్సిన రూ.491.45 కోట్లు చెల్లించాలని సైతం కోరింది. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం అనుమతులు లభించిన వెంటనే, రైళ్ల సమయాలు, నిర్వహణపై స్పష్టత రానుంది. ఎంఎంటీఎస్ రెండో దశకు సంబంధించిన నిధుల చెల్లింపు అంశం కూడా ఈ చర్చల్లో ప్రముఖంగా నిలిచింది. ఈ పథకం విజయవంతమైతే హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.