👉 హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి ‘ఏఐ కాప్‌రైటర’
👉 దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు
👉 యాప్ ను ఆవిష్కరించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్
హైదరాబాద్ , మే 23 (ఇయ్యాల తెలంగాణ) : పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు భాషా పరమైన ఇబ్బందులు కలగకుండా, వారి ఫిర్యాదులను త్వరితగతిన, కచ్చితత్వంతో నమోదు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏఐ కాప్‌రైటర్ అనే కృత్రిమ మేధ ఆధారిత మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో శనివారం ఏఐ కాప్‌రైటర్ యాప్ ను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. దాని పనితీరును పరిశీలించారు.
నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా, బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు తక్షణమే రికార్డు చేసి, అనువదించుకోవచ్చు.
హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్టాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాష అర్థం కాక ఎఫ్.ఐ.ఆర్ నమోదులో జాప్యం జరగడం, సమాచారం తప్పుగా నమోదవ్వడం వంటి సమస్యలకు ఈ యాప్ స్వస్తి పలకనుంది. 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యం ఈ యాప్ సొంతం. ఈ వినూత్న యాప్ ను బ్లూక్లౌడ్ సాఫ్టెక్ సొల్యూషన్స్ సంస్థతో పాటు ఇంటర్న్ పాగ్రో చందు సహకారంతో హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించింది