నిందితురాలి Arrest – CP రష్మీ పెరుమాళ్
హుస్నాబాద్, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : మంచినీళ్ళ బండ గ్రామంలో కలకలం రేపిన బోయిని రాజ్యలక్క్ష్మి`రాజవ్వ హత్య ఉదంతం దొంగతనం కాదు, కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న భార్యే చేసిన హత్యగా పోలీసులు తేల్చారు. నిందితురాలిని అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కేసు వివరాలు:
మంచినీళ్ళ బండ గ్రామానికి చెందిన బోయిని కనకయ్య వ్యవసాయంతో పాటు హమాలీ పని చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు.పెద్ద భార్య రాజ్యలక్క్ష్మి, చిన్న భార్య బోయిని రాధ. ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. 21`5`2026న కనకయ్య హమాలీ పని నిమిత్తం కట్కూర్ గ్రామానికి వెళ్ళాడు.గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి పెద్ద భార్య రాజ్యలక్క్ష్మిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి, మెడలోని 3.5 తులాల బంగారు పుస్తెల త్రాడును ఎత్తుకెళ్ళినట్లు కనకయ్యకు సమాచారం అందింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, కనకయ్య ఫిర్యాదు మేరకు అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అసలు నిజం:కేసు నమోదు చేసుకున్న అక్కన్నపేట పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగినట్లుగా సృష్టించిన సీన్‌పై అనుమానం రావడంతో విచారించగా, అసలు నిజం బయటపడింది. కుటుంబ గొడవల నేపథ్యంలో కనక్కయ్య పెద్ద భార్య యొక్క పెత్తనం ఎక్కువ అయి, ప్రతి దానికి చిన్న భార్య ను అనుమానం వ్యక్తం చేస్తూ తిడుతుండేది. 21`05`2026 పెద్ద భార్య చిన్న భార్యతో గొడవ పెట్టుకున్నది. రాజ్యలక్క్ష్మి నిద్రిస్తున్న సమయంలో , రాధతో ఊకె లొల్లిపెట్టుకుందని ఇంట్లో ఉన్న కర్రతో రాజ్యలక్క్ష్మి తలపైన చిన్న భార్య బోయిని రాధనే పెద్ద భార్య రాజ్యలక్క్ష్మిని తీవ్రంగా గాయపరిచి హత్య చేసినట్లు తేలింది.తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, జిల్లాలో దొంగలు పడుతున్నారనే విషయాన్ని ఆసరాగా తీసుకుని, తానే మెడలోని బంగారాన్ని తీసివేసి ఒక దగ్గర భద్ర పరిచి, కదలికలు లేకుండా పడి ఉన్న రాజ్యలక్క్ష్మి చూసి చనిపోయింది అనుకొని, ఇంటి ముందుకు వెళ్ళి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి హత్య చేసినట్లుగా తప్పుడు ప్రచారం సృష్టించింది.పోలీసులు నిందితురాలు బోయిని రాధను అరెస్ట్ చేసి, జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
