సమావేశంలో మాట్లాడుతున్న మల్యాల మధుసూదన్ యాదవ్
హైదరాబాద్, జూన్ 14 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్: ఆలయాల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి పాతబస్తీలో పర్యటన నిర్వహించనున్నట్లు భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ తెలిపారు. ఇందుకోసం ఉత్సవాల నిర్వాహకులు ఆయా దేవాలయాల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనుల నివేదికలను సాధ్యమైనంత వెంటనే అందజేయాలని ఆయన కోరారు. అక్కన్న మాదన్న దేవాలయం ప్రార్ధన మందిరంలో జరిగిన బోనాల జాతర ఉత్సవాలు-2026 సర్వసభ్య సమావేశంలో కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ… పాతబస్తీలో జిహెచ్ఎంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ తో పాటు రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ పరిధిలోని ఆలయాల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. బోనాల జాతర ఉత్సవాల ప్రారంభానికి ముందే అన్ని దేవాలయాల వద్ద అవసరమైన మేరకు అభివృద్ధి పనులను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ప్రతి ఏడాది హడావుడిగా పనులు చేస్తూ తూతూ మంత్రంగా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఈసారి అలా కాకుండా ఉత్సవాల ప్రారంభానికి ముందే అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. గత కొన్నేళ్ల పరిస్థితులను గమనిస్తే ఇప్పటికీ కొన్ని ఆలయాల వద్ద బోనాల పెండింగ్ పనులు అలాగే ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులతో త్వర త్వరగా పనులను చేయించడానికి అన్ని దేవాలయాల ప్రతినిధులు వెనువెంటనే స్పందించి తమ దరఖాస్తులను అందజేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి పాతబస్తీ లోని అన్ని దేవాలయాల కమిటీ ప్రతినిధులు, సభ్యులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులందరూ హాజరై తమ సలహాలు సూచనలు అందజేశారు. ఇప్పటికి ఇద్దరు ముగ్గురు తమ తమ దేవాలయాల ప్రతినిధుల పేర్లను అందజేయలేదన్నారు. తమ తమ దేవాలయాలకు చెందిన పేర్ల ప్రతిపాదన పూర్తైతే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీకి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించడానికి వీలు కలుగుతుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, జనగామ మధుసూదన్ గౌడ్, ఆలే భాస్కర్ రాజ్ లతో పాటు పలు దేవాలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు
