హైద్రాబాద్ , జూన్ 6 (ఇయ్యాల తెలంగాణ) : పాతబస్తీ ఉప్పుగూడా ప్రాంతంలోని శ్రీ కాళికమాత ఆలయ భూమిని గతంలో రాష్ట్రీయ వానరసేన పోరాటం చేసి ఆక్రమణల నుండి కాపాడి తిరిగి దేవాలయానికి అప్పగించింది.అయితే ప్రస్తుతం కొంతమంది స్థానిక నాయకులు ఆలయ భూమిని తమ ఆధీనంలో ఉంచుకొని సుమారు 300 ఉఊఓఅ వాహనాలను పార్కింగ్ చేయిస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పార్కింగ్ పేరుతో ఎటువంటి పారదర్శక అనుమతులు లేకుండా బౌండరీ వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సమాచారం అందుతోంది.ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆలయ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉన్న నేపథ్యంలో వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలి. ఆలయ భూమి ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటే, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధంగా టెండర్లు నిర్వహించి వచ్చే ఆదాయం పూర్తిగా దేవాలయ అభివృద్ధికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్ చేస్తోంది.అలాగే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, ఆలయ భూమిని పూర్తిగా పరిరక్షించాలని రాష్టీయ వానరసేన ప్రభుత్వాన్ని కోరుతోంది.