హైదరాబాద్, ఆగస్టు 14 (ఇయ్యాల తెలంగాణ) : భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా యాత్ర తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని అనేక చోట్ల ఘనంగా ముందుకు సాగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలంతా మువ్వన్నెల పతాకాలు చేతబూని కదం కలిపారు. భారత దేశం జరుపుకుంటున్న 80వ స్వాతంత్య్ర వసంతాల వేడుకల్లో భాగంగా తిరంగా యాత్ర వాడ వాడలా, ఊరూరా గ్రామగ్రామాన ప్రతి చోట మువ్వన్నెల రెపరెపలు కొనసాగించింది. ప్రతి ఒక్కరిలో జాతీయతా భావాన్ని ముందుకు నడిపించింది. శుక్రవారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు అనేక చోట్ల దేశ భక్తి పెంపొందించేలా తిరంగా యాత్ర ముందుకు సాగించారు. చిన్నారుల నుంచి బడా నాయకుల వరకు ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాలు చేతబట్టి “భారత్ మాతా కీ జై” అంటూ కదం కలిపారు. అడుగడుగునా తిరంగా యాత్రకు ప్రజలు నుంచి స్పందన లభించింది.

అటు నగర వాసులు ఇటు పాతబస్తీ వాసులు అంతటా వేల సంఖ్యలో త్రివర్ణ పతకాలు చేతబట్టి అన్ని చోట్ల తిరంగా యాత్రను జయప్రదం చేశారు. కేంద్రమంత్రి స్థాయి నుంచి సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు తిరంగా యాత్ర లో ఉత్సాహ భరితంగా పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు కొనసాగిన తిరంగా యాత్రలో కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్,గవర్నర్ బండారు దత్తాత్రేయ, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, డాక్టర్ లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కె. రామ్ చందర్ రావు వివిధ జిల్లాల బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తిరేంగా యాత్రలో పాల్గొన్నారు.
