తమిళనాడులో హంగ్..? మెజార్టీకి 12 సీట్లు తక్కువ

చెన్నై, మే 04 (ఇయ్యాల తెలంగాణ) :  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠకు దారితీశాయి. మొత్తం 234 స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన  మేజిక్ ఫిగర్ 118  కాగా, అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే  106 స్థానాల వద్దే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీకి కేవలం 12 స్థానాల దూరంలో విజయ్ నిలిచిపోవడంతో, ఇప్పుడు రాష్ట్రం  హంగ్  ముంగిట నిలిచింది. డీఎంకే, అన్నాడీఎంకే కూటములు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేకపోతే, తమిళనాట  రాష్ట్రపతి పాలన  విధించే ప్రమాదం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

భారత రాజ్యాంగంలోని  ఆర్టికల్ 356  ప్రకారం, ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు  రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో, గవర్నర్ ముందుగా అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. అయితే, బలనిరూపణకు అవసరమైన 12 మంది అభ్యర్థుల మద్దతును విజయ్ సేకరించలేకపోతే, ఆ తర్వాత రెండో అతిపెద్ద పార్టీకి ఆ అవకాశం దక్కుతుంది. ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నట్లు గవర్నర్ నిర్ధారణకు వస్తే, ఆయన కేంద్రానికి రాష్ట్రపతి పాలన కోసం సిఫార్సు చేస్తారు.హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు గవర్నర్ తన విచక్షణాధికారాన్ని  ఉపయోగిస్తారు. సర్కారియా కమిషన్ , బొమ్మై తీర్పు మార్గదర్శకాల ప్రకారం,  

1. ఎన్నికల ముందే  ఏర్పడిన కూటమికి  ,

2. అతిపెద్ద ఏకైక పార్టీకి ,

3. ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ, విజయ్‌తో చేతులు కలిపేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ఆసక్తి చూపని పక్షంలో, డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలు  కాంగ్రెస్, లెఫ్ట్ నిర్ణయాత్మక శక్తిగా మారతాయి. వారు కూడా మద్దతు ఇవ్వకపోతే రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది.తమిళనాడు చరిత్రలో దశాబ్దాల పాటు సాగిన ద్విముఖ రాజకీయాలకు ఈ ఫలితాలు ముగింపు పలికాయి. అయితే, కొత్త శక్తిగా ఉద్భవించిన విజయ్ కి  ప్రజాధరణ  ఉన్నా  మెజారిటీ  లేకపోవడం ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అన్నాడీఎంకే, డీఎంకేలు తమ ఉనికిని కాపాడుకోవడానికి పట్టుబడుతున్న వేళ, విజయ్ కి మద్దతు ఇవ్వడం అంటే తమ గొయ్యి తామే తవ్వుకోవడమని ఆ పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ రాజకీయ పంతాల మధ్య సామాన్య ఓటరు తీర్పు ఇప్పుడు గందరగోళంలో పడింది.ఒకవేళ ఆర్టికల్ 356 అమలులోకి వస్తే  రాష్ట్ర పరిపాలన నేరుగా గవర్నర్ చేతుల్లోకి వెళ్తుంది.

కేంద్రం తరపున గవర్నర్ అడ్వైజర్ల సహాయంతో పాలన సాగిస్తారు. అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్ లో  ఉంచుతారు. ఈ కాలంలో ఏవైనా కొత్త సవిÖకరణాలు ఏర్పడి, ఎవరైనా మెజారిటీ నిరూపించుకుంటేనే మళ్ళీ ఎన్నికైన ప్రభుత్వం కొలువుదీరుతుంది. లేనిపక్షంలో ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.విజయ్ ఇప్పుడు  కింగ్  అవుతారా లేక  కింగ్ మేకర్ల  దయపై ఆధారపడతారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చినా మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టం అవుతుంది.  ఒకవేళ అలా జరగకపోతే, తమిళనాడులో కొంతకాలం పాటు రాజకీయ శూన్యం ఏర్పడి, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఏదేమైనా, తమిళ ఓటరు మార్పు కోరుకున్నా.. అది స్థిరమైన ప్రభుత్వానికి దారితీస్తుందా? లేక రాజకీయ గందరగోళానికా? అన్నది సాయంత్రానికి వెలువడే తుది లెక్కలు, ఆపై జరిగే రాజకీయ బేరసారాల విÖద ఆధారపడి ఉంటుంది.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....