హైదరాబాద్, జూన్ 25, (ఇయ్యాల తెలంగాణ ) :
రోజూ ఒకరపై ఒకరు ఆరోపణలు, సొంత నాయకులపైనే విమర్శలు.. అధ్యక్షుడిపైనే మూకుమ్మడి దాడి.. గ్రూపు తగాదాలు.. ఇది కొద్ది నెలల ముందు వరకు కాంగ్రెస్ పరిస్థితి. ఈ పార్టీ.. ఈ నేతలతో నెగ్గుకురావడం అసాధ్యం అని చాలామంది అనుకున్నారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగినప్పటి నుంచి పరిస్థితి కొంతమేర మారింది. రాష్ట్ర ఇంచార్జీగా ఠాగూర్‌ను తీసేసి.. ఠాక్రేకు బరిలోకి దింపారు. అంతేకాదు పలు కీలక నియామకాలు చేశారు. ఇక కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో.. తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆపేశారు. చేరికలు పెరిగాయి. గాంధీ భవన్ వద్ద జోష్ కనిసిస్తుంది. కేడర్‌లో కూడా ఊపు పెరిగింది. అటు రేవంత్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి వెళ్లివచ్చారు. ఇటు భట్టి పాదయాత్ర ద్వారా పార్టీ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రియాంక గాంధీ కూడా ఓ సారి పబ్లిక్ విూటింగ్ అటెండ్ అయ్యి వెళ్లారు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఉరకలెత్తే ఉత్సాహంతో పరుగులు తీస్తుందిచన్నీళ్లకు వేడి నీళ్లు తోడు అన్నట్లుగా.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరిక ఖాయమైంది. వీరిద్దరూ కూడా బలమైన నాయకులు. పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తన ప్రభావం చూపగలరు. కృష్ణారావు కూడా మహబూబ్ నగర్లో జిల్లాలో తన మార్క్ చాణుక్యం ప్రదర్శించగలరు. ఈ క్రమంలోనే మరో 2 బోనస్‌లు కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. అందులో ఒకరు షర్మిల కాగా, మరొకరు ఈటల రాజెందర్. అవును.. కాంగ్రెస్ `షర్మిల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాడు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ అంశాన్ని డీల్ చేస్తున్నారు. త్వరలోనే ఇరు పక్షాల నుంచి కీలక ప్రకటన దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. షర్మిల టచ్‌లో ఉన్నారని రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే ఇప్పటికే ప్రకటించారు. అయితే పొత్తా, వీలీనమా అన్నది త్వరలోనే తేలిపోనుంది.ఇక ఈటల రాజేందర్ సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రస్తుతం బీజేపీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్రనాయకత్వం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల.. పొంగులేటిని బీజేపీలోకి ఆహ్వానించడానికి వెళితే.. తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారని ఆఫ్ ద రికార్డ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బుజ్జగించేందుకు ఢల్లీి బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినా.. ఆయన వెళ్లేందుకు ఆసక్తి కనబరచలేదని తెలిసింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఆయనకు పొసగడం లేదని అర్థం అవుతుంది. బీజేపీ మాత్రం బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈటల మనసు కాంగ్రెస్ వైపు లాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కాంగ్రెస్ వ్యూహకర్త సునీలు కనుగోలు వ్యూహాలకు కూడా ప్లస్ అవ్వనున్నాయి. ఇలా ఎన్నికలకు 5 నెలల ముందుకు కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మరి ఇదే అనుకూలత ఎన్నికల వేళ కూడా ఉంటుందో, లేదో చూడాలి.