పాఠశాల విద్యార్థులారా …! నెలకు 2000 చొప్పున సంవత్సరంలో
24000 రూపాయలు స్కాలర్ షిప్ అందుకోవాలనుకుంటున్నారా !
6–11వ తరగతి విద్యార్థులకు అవకాశం !
ఎంపికైతే స్కాలర్‌షిప్, ప్రఖ్యాత పరిశోధన సంస్థల్లో ఇంటర్న్ షిప్
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆఖరి తేదీ సెప్టెంబరు 30
హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించేందుకు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను ఆవిష్కరణలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్షను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభాన్వేషణ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం మరియు విజ్ఞాన భారతిలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దేశంలో ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ ఫస్టియర్ చదువుతున్న వారికి ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్‌షిప్, స్కాలర్‌షిప్‌లు పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తులు ఆహ్వానం:
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30వ తేదీలోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ పద్దతిలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది.
పరీక్షా విధానం:
విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ ప్రతిభా పరీక్ష 6 నుండి 11(ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం)తరగతులకు విడివిడిగా ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లీషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఆసక్తిని బట్టి వారికి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు.
100 మార్కులకు పరీక్ష:
ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను 01 సెప్టెంబర్ నుంచి నిర్వహిస్తారు.పాఠశాల స్ధాయీ ప్రధాన పరీక్ష అక్టోబరు 28 నుండి 30 తేదీల వరకు ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవిల్ 2 ద్వితీయ పరీక్షను ఆన్లైన్ లో ప్రోక్టరింగ్ విధానం లో పరిశీలకుల సమక్షంలో 19 నవంబర్ తేదీలో ఉంటుంది. పై రెండు పరీక్షలు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య కాలంలో 90 నిమిషాల పాటు(గంటన్నర) పరీక్షను రాయాల్సి ఉంటుంది. పరీక్ష రాసే ప్రతి విద్యార్థి ఒకసారి యాప్‌లో లాగిన్ అవ్వగలుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.లెవిల్ 1 ప్రధాన పరీక్ష లో ప్రతీ తరగతులకు సంబంధించిన 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు వంతున 100 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్–ఎలో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి 20 ప్రశ్నలు(20మార్కులు),సత్యేంద్రనాధ్ బోస్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు(20 మార్కులు), సెక్షన్–బిలో 6 నుండి 11 తరగతులకు సంబంధించి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు(50 మార్కులు), లాజిక్, రీజనింగ్ 10 ప్రశ్నలు(10మార్కులు) ఉంటాయి.ఇందు ఉత్తీర్ణులైన వారికి లెవిల్ 2 ద్వితీయ పరీక్ష లో 50 ప్రశ్నలు 100 మార్కులు కు ఉంటాయి.
రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారిలా:
పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయి పరీక్ష డిసెంబర్ 21 లేదా 28 లేదా జనవరి 4 తేదీల్లో ఏదో ఒక రోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేలతో పాటు మెమెంటో, సర్టిఫికేట్ అందజేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మెమెంటో, ప్రశంసాపత్రం అందజేస్తారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ఇలా:
రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని ప్రతి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని జాతీయ స్థాయి విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25వేలు, రూ.15వేలు, రూ.10వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు 2000 చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్‌డీవో, ఇస్రో, సీఎస్‌ఐఆర్, బీఏఆర్‌సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1–3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్‌షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు.
సృజనాత్మకతను వెలికి తీసేందుకు:
విద్యార్థుల్లో దాగి ఉన్న సజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ఒక చక్కని వేదికగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సైన్స్ పట్ల అభిరుచిని పెంచడం, వారిని శాస్త్రవేత్తలుగా తయారు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ పరీక్ష ను ప్రభుత్వ మరియు ఇతర యాజమాన్య ప్రైవేటు పాఠశాలలు కూడా పాల్గొనవచ్చును. శ్రీ .ధర్మేందర్ జిల్లా సైన్స్ అధికారి హైదరాబాద్ జిల్లా
వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి:
పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. విద్యార్థులు డబ్యుడబ్యుడబ్యు.వీవీఎం.ఓఆర్‌జి.ఇన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వవచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. ఆర్. రోహిణి, జిల్లా విద్యాశాఖాధికారి, హైదరాబాద్ జిల్లా.
సి. ధర్మేందర్ రావు, జిల్లా కోఆర్డినేటర్ ,విద్యార్థి విజ్ఞాన్ మంథన్,
ముఖ్యమైన తేదీలు ఇవే:
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01 జూన్ 2025.
మాదిరి పరీక్షలు(మాక్ టెస్ట్స్): ఈ ఏడాది సెప్టెంబర్ 01 నుంచి
పరీక్ష తేదీ: లెవిల్ 1 : అక్టోబరు 28 నుంచి అక్టోబర్ 30 వరకు
లెవిల్ 2: నవంబర్ 7
పరీక్ష సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో 90 నిమిషాలు మాత్రమే). (ఒకసారి మాత్రమే పరీక్షకు హాజరు కావాలి)
పరీక్షల ఫలితాల వెల్లడి: నవంబరు 27
రాష్ట్ర స్థాయి క్యాంపు: డిసెంబర్ 21 లేదా డిసెంబరు 28 లేదా జనవరి 4 (ఏదైనా ఒక రోజు).
జాతీయ క్యాంపు: 2026 మే నెలలో