Telangana లో విష జ్వరాలు !

హైదరాబాద్‌, ఆగస్టు 18, (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి వాటితో పాటు వైరల్‌ ఫీవర్స్‌ వణికిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా వర్షాలు పడుతుండటంతో దోమల వ్యాప్తి ఎక్కువయింది. దీంతో ఎక్కువ మంది జ్వరపీడితులు తెలంగాణలో కనిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. అదే సమయంలో డెంగీ జ్వరం కూడా తెలంగాణను వణికిస్తుంది. మరొకవైపు మలేరియా వ్యాధి కూడా ప్రబలుతోందని లెక్కలు చెబుతున్నాయి. అనేక మంది ఇన్‌ పేషెంట్లుగా ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. గత రెండు వారాల నుంచి భారీ వర్షాలు నమోదు అవుతుండటంతో దోమల వ్యాప్తి పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌ తో పాటు అన్ని ప్రాంతాల్లో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రధానంగా ములుగు, మహబూబ్‌ నగర్‌, మెదక్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు మూడు వేలకుపైగా డెంగీ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్లేట్‌ లెట్స్‌ పడిపోతుండటంతో రక్త సేకరణ కూడా ఖర్చుతో కూడిన విషయంగా మారింది.రక్తదాతలు సహకరిస్తున్నప్పటికీ అందరూ ప్రయివేటు ఆసుపత్రిలో చేరే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. దీంతో పాటు చికెన్‌ గున్యా కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ పదమూడు లక్షల మంది జ్వరాన పడినట్లు వైద్య శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత కూడా ప్రజలను ఇబ్బందులను పెడుతుంది. ఓపీ కౌంటర్ల వద్ద కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. జ్వరంతో వచ్చిన వారికి పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసే సమయానికి తలదాచుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం విూద తెలంగాణలో జ్వరంతో బాధపడుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....