Telangana – ఆగని చెరువుల ఆక్రమణలు

రంగారెడ్డి, జూన్‌ 12, (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కబ్జాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. చెరువులు సైతం కనిపించకుండాపోతున్నాయి. కాలువలను కబ్జా చేసి, చెరువులను మాయం చేసి పెద్దపెద్ద నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. వాటిలో ఎర్రకుంట చెరువు ఒకటి.బాచుపల్లిలోని సర్వే నెంబర్‌ 134లో ఉంటుంది ఎర్రకుంట చెరువు(లేక్‌ ఐడీ: 2800/ఈ/17). అయితే, ఇక్కడ మూడు నిర్మాణాలకి హెచ్‌ఎండీఏ, రెవెన్యూ అధికారుల నుంచి పర్మిషన్‌ రావడం వివాదాస్పదమైంది. చాలా రోజులుగా దీనిపై స్థానిక బీజేపీ నేతలు పోరాడుతున్నారు. పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 18న సర్వే జరిగింది. డీఐ సర్వేయర్‌ గంగాధర్‌, ఏడీ శ్రీనివాస్‌, బాచుపల్లి ఎంఆర్‌ఓ రిపోర్ట్‌ రెడీ చేశారు. అందులో ప్రభుత్వ భూమి కబ్జా కాలేదని, అది ప్రవేట్‌ భూమేనని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎర్రకుంట చెరువు మొత్తాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల చేతులకి అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.డీఐ సర్వేయర్‌ గంగాధర్‌, ఏడీ శ్రీనివాస్‌ తీరుపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఒక్కో కో ఆర్డినేట్‌ను దాదాపు 9 విూటర్ల మేర జరిపి కార్పొరేటర్‌, కొందరు బిల్డర్లకు లబ్ది చేకూర్చేలా సర్వే చేశారని అంటున్నారు. మార్చి 11 తేదీన సర్వేలో చెరువు స్థలం 3 ఎకరాలు వస్తే, 18వ తేదీ చూపించిన హద్దుల తర్వాత 2.19 ఎకరాలు మాత్రమే వచ్చిందని ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. చెరువు స్థలం ఎందుకు తగ్గింది? ఎలా తగ్గిందని అడుగుతున్నారు బీజేపీ నేతలు. ఎర్రకుంటలోని ఆక్రమణలు తొలగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తప్పుల తడకగా సర్వే నిర్వహించారని ఆరోపించారు.ఎర్రకుంట చెరువును క్రమించి తప్పుడు పత్రాలలో అనుమతులు పొంది ధ్యంసం చేశారని, సరైన సర్వే చేసి కాపాడాలని డిమాండ్‌ చేశారు బీజేపీ నేతలు. కలెక్టర్‌కు, ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదుల విూద ఫిర్యాదులు చేస్తే ఇప్పటికి గానీ సర్వేకు రాలేదని, తీరా సర్వే చేసి మూడు ఎకరాల ఎర్రకుంట చెరువు ప్రభుత్వ భూమి కాదని ప్రైవేట్‌దని రిపోర్ట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విధంగా సర్వే రిపోర్ట్‌ ఇవ్వడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. సర్వేయర్లు దాదాపు రెండు కోట్ల ముడుపులు దండుకొని ఆక్రమణదారులకు అనుకూలంగా సర్వే రిపోర్ట్‌ తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పటికైనా కలెక్టర్‌, హెచ్‌ఎండీఏ అధికారులు అక్రమ అనుమతులు, తప్పుడు సర్వే రిపోర్ట్‌పై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. డీఐ సర్వేయర్‌ గంగాధర్‌, ఏడీ సర్వేయర్‌ శ్రీనివాస్‌ను తక్షణమే సస్పెండ్‌ చేసి విచారణ జరిపి, ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని, లేకపోతే అక్కడ టెంటు వేసి నిరాహార దీక్షకు దిగుతామని బీజేపీ నాయకులు, కార్పొరేషన్‌ సెక్రెటరీ అరుణ్‌ రావు, విూడియా సెల్‌ కో కన్వీనర్‌ ఉదయ్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షులు ప్రసాద్‌ రాజు, ఉపాధ్యక్షులు మాధవరావు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముఖేష్‌ సీనియర్‌ నాయకులు ఎల్లస్వామి, కాలనీవాసులు తదితరులు హెచ్చరించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జాలకు సహకరించి, అనుమతులు ఇప్పించి ఇప్పుడు చెరువులు కాపాడాలని ఎమ్మెల్యే వివేకానంద చిలుక పలుకులు పలుకుతున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎర్రకుంటను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ గౌతం, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలి దీనిపై దృష్టి సారించాలని కోరారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....