Ramantapur ఘటన – బాధితులకు అండగా ఉంటామన్న ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆగస్టు 18, (ఇయ్యాల తెలంగాణ) : నగరంలోని రామాంతాపూర్‌లో కృష్ణ జన్మాష్టమి ముగింపు వేడుకల్లో కరెంట్‌ షాక్‌ కొట్టి చనిపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది. రథానికి కరెంట్‌ తీగలు తగిలి విద్యుత్‌ షాక్‌తో చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. రామాంతాపూర్‌  ఘటనలో మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్‌ బాబు పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీ ఆసుపత్రికి వెళ్లిన శ్రీధర్‌ బాబు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హావిూ ఇచ్చారు.రామంతాపూర్‌ ప్రాంతంలో జరిగిన విద్యుత్‌ షాక్‌ ఘటనపై రాష్ట్ర విద్యుత్‌ శాఖ సీఎండీ ముషారఫ్‌ స్పందించారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. సీఎండీ ముషారఫ్‌ స్థానికులతో మాట్లాడి, ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన, అక్కడి పరిస్థితులు చూసి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

 ‘‘ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. చాలా రోజులుగా విద్యుత్‌ వైర్లు అస్తవ్యస్తంగా, ఎలక్ట్రిక్‌ పోల్స్‌ హఠాత్తుగా పడిపోతున్నాయని  ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశాం. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇవాళ అయిదుగురు ప్రాణాలను బలితీసుకుంది,’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామంతపూర్‌ వాసులు సీఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా విద్యుత్‌ శాఖ మేలుకోవాలి,’’ అంటూ బాధితులు, స్థానికులు వాపోయారు.వీటితో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, ఎలక్ట్రిక్‌ స్టాండ్లు, పలుచనైన పోల్‌లు వంటి సమస్యలను సీఎండీకి చూపించారు. ఈ ప్రమాదం రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ నిర్వహణపై తీవ్ర చర్చకు దారితీసింది. 

రథం లాగుతుంటే తగిలిన విద్యుత్‌ తీగలు

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌ ఏరియా గోకులనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకలు ముగింపు సందర్భంగా నిర్వహించిన రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపు చేస్తున్న రథం విద్యుత్‌ తీగలకు తాకడంతో ఒక్కసారిగా కరెంట్‌ షాక్‌ వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు కృష్ణయాదవ్‌ (21), రాజేంద్రరెడ్డి (45), సురేశ్‌ యాదవ్‌ (34), రుద్రవికాస్‌ (39), శ్రీకాంత్‌రెడ్డి (35) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గణేష్‌ అనే వ్యక్తి చనిపోవడంతో షార్ట్‌ సర్క్యూట్‌ తో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....