హైదరాబాద్, జూలై 27 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలంగాణ వాతావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ వాన నీటితో నిండి పోయాయి. వరద ప్రవాహంతో చెరువుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. గండిపేట చెరువు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువులు పూర్తిగా నీటితో నిండి పోవడంతో గేట్లన్నీ ఎత్తివేయడం జరిగింది.
మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండవలసిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా వచ్చిన వరద నీటితో అనేక ప్రాంతాల్లో ప్రజలు నిద్ర లేకుండా గడిపారు. పలుచోట్ల ఇండ్లలోకి వచ్చిన వరద నీటిని తోడి బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.