హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : శివరాత్రి పండుగను పురస్కరించుకొని పాతనగరంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి బుధవారం తెల్లవారు జామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటికీటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగించారు. అభిషేకాల కోసం నిలబడిన భక్తుల క్యూ లైన్లు కిక్కిరిసి కనిపించాయి. గౌలిపుర, లాల్ దర్వాజా, ఛత్రినాక, ఉప్పుగూడ, చార్మినార్ తదితర ప్రాంతాలలోని ఆలయాలలో భక్తులు కిక్కిరిసి కనిపించారు. గౌలిపురా బతుకమ్మ బావి సమీపంలోని రాజ రాజేశ్వరి ఆలయంలో ధర్మకర్త శేషాద్రి అయ్యంగార్ ఆధ్వర్యంలో సుందర్ అయ్యంగార్, ఆది తదితరాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చిత్రగుప్త దేవాలయం, ఛత్రినాక లక్ష్మణేశ్వర ఆలయంతో పాటు అలియాబాద్, లాల్ దర్వాజా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చార్మినార్ లోని శివ మందిర్ లో త్రివేణి సంగమం, కుంభమేళా దృశ్యాలు ఏర్పాటు చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించుకున్నారు.