హైదరాబాద్, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : పాతనగర పురవీధుల్లో బోనాల ఊరేగింపు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రధాన ఆలయాల దగ్గర భక్త జన సందోహంతో వీధులన్నీ అమ్మవారి నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య తీన్మార్ ఆట పాటలతో యువకుల కేరింతల మధ్య సమూహిక ఊరేగింపు ముందుకు కొనసాగుతుంది. అంతకు ముందు పాతనగరంలోని ప్రధాన ఆలయాల వద్ద భవిష్య వాణి (రంగం) కార్యక్రమం ముగిసింది. వర్షాలు విస్తారంగా కురుస్తాయని , చెట్లను నాటాలని, మంచి చేస్తే మంచి, చేడు చేస్తే చేడు జరుగుతున్నదని భవిష్యవాణి వినిపించింది.
అనంతరం బోనాల జాతర ముందుకు సాగింది. జాతర పొడవునా వివిధ రకాల వేషధారణలు, పోతురాజుల విన్యాసాలు నృత్యాలు తిలకించడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని బోనాల జాతరలను తిలకించడానికి వచ్చారు. సుల్తాన్ షాహీ, గౌలిపురా, ఉప్పుగూడ, లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్ మదీన మీదుగా బోనాల జాతర నయాపూల్ వరకు చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపిన అనంతరం జాతర పూర్తవుతుంది. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అత్యంత పటిష్ట బందోబస్తును నిర్వహించారు.వివిధ శాఖల సమన్వయ కృషితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా GHMC – శానిటేషన్, వాటర్ వర్క్స్ అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ స్వచ్చంధ సంస్థలు కూడా తోడ్పాటును అందించారు.