👉 బరిలో 12,930 మంది అభ్యర్థులు
👉 మరి కొద్ది గంటల్లో పోలింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎటువైపు ఉండనుందో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తంకానుంది. గత పది రోజులుగా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. బుధవారం పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం సోమవారం సాయంత్రం అయిదు గంటలకు అధికారికంగా ప్రచారం ముగిసింది. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2,982 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. మరో 14 వార్డులు ఏక గ్రీవమయ్యాయి. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 12,930 మంది తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సైతం అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలపకపోవడం విశేషం. ఈ ఎన్నికల్లో మరో విశేషం సైతం నమోదైంది. మొత్తం అభ్యర్థుల్లో మహిళా అభ్యర్థులే అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 12,930 మందిలో పురుషులు 6,434 (49.76 శాతం) మంది కాగా, మహిళలు 6,496 (50.24 శాతం) మంది.
అత్యధికంగా కరీంనగర్‌లో అభ్యర్థులు
అత్యధికంగా కార్పొరేషన్లలో కరీంనగర్‌లో మొత్తం 66 డివిజన్లకు గాను 398 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీలలో ఆదిలాబాద్‌లో 49 వార్డులకు గాను 314 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా కొడంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 34 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
పార్టీల వారీగా చూస్తే..
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 2,948 (98.3 శాతం) స్థానాల్లో, బీఆరఎస్ 2,878 (96 శాతం) స్థానాల్లో, బీజేపీ 2,634 (87.3 శాతం) స్థానాల్లో పోటీలో నిలిచాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు 2,786 (94 శాతం) స్థానాల్లో బరిలో నిలిచారు. జనసేన పార్టీ 332 (11.1 శాతం) స్థానాల్లో, మజ్లిస్ పార్టీ 282 (9.4 శాతం) స్థానాల్లో, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 288 (9.6 శాతం) స్థానాల్లో, బీఎస్పీ 213 (7.3 శాతం) స్థానాల్లో, సీపీఐ 168 (5.6 శాతం) స్థానాల్లో, సీపీఎం 108 (4.2 శాతం) స్థానాల్లో, ఆప్ 38 (1.2 శాతం) స్థానాల్లో, ఐయూఎంఎల్ తొమ్మిది (0.3 శాతం) స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీల నుంచి పలువురు నామినేషన్లు వేసినప్పటికీ, బీఫారాలు సమర్పించకపోవడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఇతర పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్నారు.
ఏకగ్రీవమైనవి ఇవే..
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లోని 58వ డివిజన్‌లో రమాదేవి, రామగుండం కార్పొరేషన్‌లోని ఒకటో డివిజన్‌లో మాడిపల్లి విజయ, చౌటుప్పల్‌లో చింత ఉమామహేశ్వరి (17వవార్డు), హాలియాలో పిల్లి చంద్రకళ(10), ఎదులాపురంలో తమ్మినేని మంగతాయి(15), హుజూర్‌నగర్‌లో నాగలక్క్ష్మి(3), కోదాడలో దేవరపల్లి మల్లేశ్వరి(11), వై.కుసుమకుమారి(31), కట్టెబోయిన జ్యోతి(21), మెదక్‌లో గొడల మానస(32), వికారాబాద్‌లో అనంతరెడ్డి(1), యాదగిరిగుట్టలో గుండిపల్లి వాణి (10) కాంగ్రెస్ పార్టీ తరపున, అలంపూర్‌లో విక్రం(10), వికారాబాద్‌లో విజయలక్క్ష్మి (15వ వార్డు) బీఆరఎస్? తరఫున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పోటీలో 775 పోస్ట్ గ్రాడ్యుయేట్లు..
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొత్తం అభ్యర్థుల్లో 775 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉండడం గమనార్హం. గ్రాడ్యుయేట్లు 2,903 మంది, అండర్ గ్రాడ్యుయేట్లు 7,917 మంది కాగా, నిరక్షరాస్యులు 1,291 మంది.