కరీంనగర్, జూలై 23 (ఇయ్యాల తెలంగాణ) : కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి నంబరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. అక్రమ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి, పారదర్శకతను పెంచడానికి ఇంటి కొలతలు, విస్తీర్ణం, ఎన్వోసీ వంటి నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో క్రయవిక్రయదారులకు ఊరట లభించింది. అయితే, పురపాలికలు, నగరపాలికల్లో, ముఖ్యంగా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండితో పాటు కొత్తపల్లి, రేకుర్తిలోని 200 సర్వే నంబర్లలో ఇంకా రిజిస్ట్రేషన్లపై స్పష్టత లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లోని ఇళ్ల క్రయవిక్రయాలకు ఇంటి నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును అందుబాటు లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉత్తర్వులు ఎంపీడీవోలు, గ్రామ పంచాయతీల ప్రత్యేకాధికారులు, కార్యదర్శులతోపాటు తహసీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లకు చేరాయి. ఇళ్ల క్రయవిక్రయాలు జరిపే క్రమంలో రిజిస్ట్రేషన్ల సమయంలో విధిగా నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు. విక్రయించే ఇంటిని పరిశీలించి, ఇంటి విస్తీర్ణం కొలతలు, నాలుగు వైపులా ఉన్న వారి వివరాలు, స్లాబ్ ఏరియాతోపాటు సంబంధిత డాక్యుమెంట్లతో కూడిన ఎన్వోసీ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ చర్యలు అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసి, పారదర్శకతను పెంచేందుకు ఉద్దేశించినవి అన్నారు.కాగా, గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించిన అధికారులు, పురపాలికలు, నగరపాలికల్లో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కరీంనగర్ నగరపాలిక, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి పురపాలికల్లోని ఇళ్ల క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తపల్లి, రేకుర్తిలోని దాదాపు 200 సర్వే నంబర్లలో భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు ఇప్పటికీ నిషేధంలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని ప్రజలు తమ ఆస్తులను క్రయవిక్రయాలు చేసుకోలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో తీసుకున్న సానుకూల నిర్ణయం పురపాలికలు, నగరపాలికలకు కూడా వర్తింపజేయాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఇక గ్రామాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు అటవీ శాఖ అనుమతులు లభించకపోవడంతో ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సారంగాపూర్, రాయికల్ మండలాల్లో అత్యధిక అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అడవుల మధ్య నుంచే పలు రహదారులు వెళ్తాయి. గతంలో ప్రభుత్వం ఈ గ్రామాలను కలుపుతూ రహదారుల నిర్మాణం చేపట్టినా, అటవీ ప్రాంతంలో అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు. కొంతకాలంగా రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు అటవీ శాఖకు ప్రతిపాదనలు పంపుతున్నప్పటికీ, ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. దీనివల్ల గ్రావిూణ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడం లేదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు త్వరగా అనుమతులు మంజూరు చేసి, నిలిచిపోయిన పనులను పూర్తి చేయాలని కోరుతున్నారు.