హైదరాబాద్:ఆగస్టు 24 (ఇయ్యాల తెలంగాణ ):మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ హోటల్ జనరల్ మేనేజర్పై జరిగిన కాల్పుల ఘటన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళకు చెందిన రితీష్ నాయర్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. మదీనాగూడలోని సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న దేవేందర్ గాయన్ (35)పై బుధవారం అర్ధరాత్రి కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. రితీష్ నాయర్, దేవేందర్ గతంలో ఒకేచోట మేనేజర్లుగా పనిచేశారు. నెలరోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దేవేందర్పై రితీష్ చేయిచేసుకున్నాడు. ఇదే విషయాన్ని హోటల్ యాజమాన్యానికి దేవేందర్ ఫిర్యాదు చేశారు. దాంతో నాయర్ ఉద్యోగం పోయింది.ప్రతీకారంగా నాయర్ దేవేందర్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు నిర్దారించారు.