BiPC విద్యార్థులు నెలరోజులు ఆగాల్సిందే..!

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో రెండు విడతల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఆగస్టు 2తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి చివరివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ మొదలుకానుంది. ఈ కౌన్సెలింగ్‌ ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు బీఫార్మసీ, ఫార్మా`డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సాధారణంగా ఏటా ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌లో వారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు. ఈసారి చివరి విడత తర్వాత ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో అవకాశం ఇచ్చేలా మార్పు చేశారు.ఆగస్టు 11తో చివరి విడత ప్రక్రియ పూర్తవుతుంది.  ఆ తర్వాత ఆగస్టు 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దీనిద్వారా బీఫార్మసీ, ఫార్మా`డి సీట్లలో 50 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. రాష్ట్రంలో సుమారు 13 వేల ఫార్మసీ సీట్లు(కన్వీనర్‌, యాజమాన్య కోటా) అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్‌ కోటాలో ఫార్మా కోర్సులో ఎంపీసీ విద్యార్థులు చేరాలంటే ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి.

బైపీసీ విద్యార్థులు నెలరోజులు ఆగాల్సిందే..

టీఎస్‌ ఎంసెట్‌లో బైపీసీ విద్యార్థులకు సెప్టెంబరు మొదటివారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్‌ బైపీసీ అభ్యర్థుల వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్‌ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్‌ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు చేరిన తర్వాత మిగిలిన సీట్లన్నింటికీ కలిపి కౌన్సెలింగ్‌ జరుపుతారు. సెప్టెంబరు 24న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి. 

చివరి విడతలోనే ఎన్‌సీసీ, క్రీడా కోటా సీట్ల కేటాయింపు..

ఎంసెట్‌ చివరి విడతలో ఎన్‌సీసీ, క్రీడా తదితర ప్రత్యేక కోటా కింద బీటెక్‌ సీట్లను కేటాయించనున్నారు. సుమారు 1,050 మంది ఎన్‌సీసీ, 80 మంది క్రీడా విభాగం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఆయా విభాగాల అధికారులు ధ్రువపత్రాలను పరిశీలించి ఎంసెట్‌ ప్రవేశాల కమిటీకి ఇప్పటికే అందజేశారు. వారందరూ చివరి విడతలో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఆగస్టు 9న సీట్లు కేటాయిస్తారు.తెలంగాణలో ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌  ఆగస్టు 5న సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించనున్నారు. ఆగస్టు 9న విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. ఈసారి ప్రత్యేక విడత పేరిట కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్‌  ఆగస్టు 17న ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్‌ కోసం ఆగస్టు 17న స్లాట్‌ బుకింగ్‌, ఆగస్టు 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 17 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇక ఆగస్టు 23న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 23 నుంచి 25 వరకు నిర్ణీత ట్యూషన్‌ ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....