హైదరాబాద్, ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్మినార్ ప్రతిష్టతను చరిత్రాత్మక వ్యాపార కేంద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పాతబస్తీ పౌరిడిపై ఉన్నదని చార్మినార్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ అన్నారు. బుధవారం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చార్మినార్ డీసీపీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో, చార్మినార్ ప్రాంతంలోని దుకాణదారులు వీధి వ్యాపారుల నుండి అక్రమంగా “మామూల్” వసూలు చేస్తున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ చార్మినార్ ఇన్స్పెక్టర్ రామ్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖరే కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ గుర్తించిన వ్యక్తులందరినీ ఎలాంటి దోపిడీ లేదా బెదిరింపులకు పాల్పడవద్దని కఠినంగా హెచ్చరించారు. చదువుకున్న వారందరూ బాధ్యతగా మెలగడం అలవాటు చేసుకోవాలని చార్మినార్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ సూచించారు. ఏ ఉల్లంఘనకైనా రౌడీషీట్లు తెరవడం, కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం, రిమాండ్ చేయడం వంటి తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
ఇది తుది హెచ్చరిక అని, ప్రవర్తనను మార్చుకుని, చట్టబద్ధమైన జీవనోపాధి మార్గాలను అవలంబించడానికి ఇదే చివరి అవకాశమని తెలియజేశారు. సంస్కరణల విధానాన్ని అనుసరించాలని పోలీసులు నొక్కి చెప్పారు. ఆక్రమణలకు దూరంగా ఉండటం, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడటం, పరిశుభ్రమైన మరియు క్రమబద్ధమైన వాతావరణాన్ని నిర్ధారించడం ద్వారా క్రమశిక్షణ పాటించాలని దుకాణదారులకు, వ్యాపారులకు సూచించారు. కీలక పర్యాటక కేంద్రంగా చార్మినార్ ప్రతిష్టను కాపాడటం మరియు దాని కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దోపిడీల పట్ల ఏమాత్రం సహనం చూపబోమని చార్మినార్ పోలీసులు పునరుద్ఘాటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలని వారు కోరారు. చార్మినార్ జోన్ పరిధిలో ప్రజల భద్రత దృశ్య పోలీస్ నిఘా పెంచుతున్నామన్నారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో అర్ధరాత్రి ఒకటి గంటల వరకు షాపులకు అనుమతి ఇవ్వడం జరిగింది..ఒకటి గంటలకు దుకాణాలు మూసివేసే విధంగా చర్యలు చేపడుతున్నాం.. పాతబస్తీలో డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు వివిధ శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాత్రి వేళలో పాత బస్తీలోని వివిధ ప్రాంతాల్లో పాత నేరస్తులు, ఆకతాయిలు చేతున్న గొడవలపై నిఘా పెంచాం. గంజాయి మత్తులో ప్రజలను ఇబ్బంది పెట్టినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ స్టేషన్ కు వచ్చే వివిధ కేసులకు సంబంధించిన పాత నేరస్తులకు సైతం డ్రగ్స్ టెస్టులను నిర్వహిస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజలందరు సహకరించాలని, యువత డ్రగ్స్ వాడినట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ కోరారు.
