రేవంత్ అహంకారానికి ప్రజలే బుద్ధి చెబుతారు
అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు
ఫోర్త్ సిటీ ఒక పెద్ద డ్రామా.. తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టేందుకు కుట్ర.
నిషేధిత భూముల జాబితాతో బ్లాక్ మెయిల్ రాజకీయాలు.
` బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఇయ్యాల తెలంగాణ) : అన్ని వర్గాలను మోసం చేస్తూ, తన కుటుంబ సభ్యులు, అనుచరుల కోసం పేదవాళ్ల భూములను అరాచకంగా గుంజుకుంటున్న అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ చరిత్రలో ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని చీత్కరించే రోజులు తప్పకుండా వస్తాయన్నారు. రేవంత్ రెడ్డి పదవి దిగిపోయిన తర్వాత కనీసం పలకరించే నాథుడు కూడా ఉండడని, కానీ ఇదే రేవంత్ రెడ్డి తన అధికారాన్ని, పదవిని చూసుకొని అహంకారంతో ప్రవర్తిస్తున్నారన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఆ విషయం మర్చిపోయి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు.
ఈరోజు మున్సిపల్ ఎన్నికల అనంతరం దాదాపు రెండు నెలల పాటు అన్ని రకాల అన్యాయాలు, అక్రమాలు చేసిన తర్వాత ఇబ్రహీంపట్నం మరియు క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆరఎస్ గులాబీ జెండా ఎగిరిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. మెజారిటీ కౌన్సిలర్లు బీఆరఎస్ వాళ్లు గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమంగా చైర్మన్ పదవులను తీసుకునేందుకు అనేక దురాగతాలకు పాల్పడిందని, అయితే చివరికి న్యాయం గెలిచిందని కేటీఆర్ అన్నారు.
ఈరోజు ఇబ్రహీంపట్నంలో బీఆరఎస్ పార్టీ విస్తత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్, తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్పర్సన్, కౌన్సిలర్లను, సర్పంచ్లను సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అరాచకాలను ఎదుర్కొని బలంగా నిలబడిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు, పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డిని ప్రత్యేకంగా కేటీఆర్ అభినందించారు. మంచి నాయకత్వం, మొండితనం ఉన్న నాయకత్వం ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని ప్రశాంత్ ఈ ఎన్నికల్లో సాధించిన విజయం నిరూపించిందన్నారు.
ఇక రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ పేరుతో భూముల దందా చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను తిరిగి రైతన్నలకు ఇస్తామని చెప్పి వారితో ఓట్లు వేయించుకొని, ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ఒకవైపు కోర్టులో ఫార్మా సిటీ ఉందని చెబుతూ, బయటకు వచ్చి అవే భూముల్లో ఫోర్త్ సిటీ కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుందన్నారు. ఆనాడు ఫార్మా సిటీ భూముల్లో అప్పటి సిఎల్పీ నాయకుడిగా ఉన్న భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా మిగిలిన మేధావులు పాదయాత్ర చేసి, “మాకు ఓటు వేస్తే విÖ భూములు విÖకు తిరిగి అప్పజెపుతాం” అని హావిÖ ఇచ్చారని, రెండున్నర సంవత్సరాల తర్వాత మరో 16,000 ఎకరాల అదనపు భూమిని రైతుల నుంచి గుంజుకొని ఫోర్త్ సిటీని, భారత్ ఫ్యూచర్ సిటీని కడతానని నాటకాలు ఆడుతున్నారన్నారు. కేవలం తన అనుచరులకు, తన కుటుంబ సభ్యులు సోదరులకి భూములు కట్టబెట్టడం కోసమే ఈ ఫ్యూచర్ సిటీ డ్రామాను రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందన్నారు.
ఉన్న సిటీనే పట్టించుకునే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు, అలాంటిది ఫ్యూచర్ సిటీ కడతానని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు.
ఫ్యూచరే లేని నాయకుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ కడతా అంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు.
గత ప్రభుత్వం కోహెడలో 178 ఎకరాల భారీ విస్తీర్ణంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ కడతామని అంటే, వాటిని మళ్ళీ ఇప్పుడు రాచకొండ గుట్టలకో, రామోజీ ఫిలిం సిటీ అవతలకో పోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతుందన్నారు. ఈ 178 ఎకరాలను అమ్ముకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఒకప్పుడు నిషేధిత భూముల జాబితాను తగ్గించి భూమి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షలు ఉన్న నిషేధిత భూముల సంఖ్యను కోటి ఎకరాలకు పెంచి, అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భూముల దందా చేస్తోందని విమర్శించారు. ఈ నిషేధిత జాబితాను అడ్డు పెట్టుకొని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ పెద్దలు కలెక్టర్లకు ఫోన్లు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతూ భూముల దందా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారన్నారు.
అధికారులు కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రానున్న గవర్నమెంట్లో వారందరినీ గుర్తుంచుకొని మరీ తగిన విధంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల కోసం పని చేయాలని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ క్యామ మల్లేష్ తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
