న్యూ ఢిల్లీ, జూన్ 8 (ఇయ్యాల తెలంగాణ) : లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి రాహుల్ గాంధీ అంగీకరించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారన్నారు. శనివారం ఢల్లీిలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృత సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనీష్ తివారీ, డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది.కాగా, సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు విూడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత కావాలని కాంగ్రెస్ నేతలంతా గట్టిగా కోరుతున్నారని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది వర్కింగ్ కమిటీ అభ్యర్థన అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, కేరళలోని వాయనాడ్‌ల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కృషిని కూడా సీడబ్ల్యూసీ తీర్మానం కొనియాడిరదని అన్నారు.