24 గంటల మంచినీటి కోసం పక్కా Plan

హైదరాబాద్‌, జనవరి 2,(ఇయ్యాల తెలంగాణ) :  భాగ్యనగరం శరవేగంగా విస్తరిస్తోంది. అంబరాన్నంటే భవనాలు, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు, కోటిన్నరకుపైగా జనాభాతో ఈ మహానగరం ఇప్పుడు గ్లోబల్‌ హబ్‌గా మారింది. అయితే పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులు, ముఖ్యంగా తాగునీరు, మురుగు నీటిపారుదల వ్యవస్థను సిద్ధం చేయడం ఒక సవాలుతో కూడుకున్న పని. ఈ సవాలును స్వీకరించిన హైదరాబాద్‌మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ స్వరేజ్‌ బోర్డు, సిటీని ఒక ఆదర్శవంతమైన వాటర్‌ సెక్యూర్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. వాటర్‌ బోర్డు, వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులతో నగర భవిష్యత్తును మార్చడానికి రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు లేదా కొన్ని శివారు ప్రాంతాల్లో మూడు, నాలుగు రోజులకు ఒకసారి నీరు సరఫరా అవుతోంది. కానీ, ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా వాటర్‌ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. 2027 చివరి నాటికి నగరంలోని ప్రతి ఇంటికీ ప్రతి రోజూ తాగునీరు అందించడం బోర్డు ప్రాథమిక లక్ష్యం. ఆ తర్వాత 2047 నాటికి తెలంగాణ కోర్‌ ప్రాంతానికి   24 గంటల పాటు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసేలా మాస్టర్‌ప్లాన్‌ రూపొందుతోంది. నగర తాగునీటి అవసరాలు భవిష్యత్‌లో భారీగా పెరగనున్నాయి.

2027 నాటికి నగర తాగునీటి డిమాండ్‌ 835 ఎంజీడీలుగా, 2047 నాటికి అది ఏకంగా 1114 ఎంజీడీలుగా పెరుగుతుందని అంచనా. ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి గోదావరి జలాలే కీలకం. ఇప్పటికే కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలను వందల కిలోవిూటర్లు దూరం నుంచి తెస్తున్న బోర్డు, ఇప్పుడు గోదావరి ఫేజ్‌`2, ఫేజ్‌`3 ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. రూ. 7,360 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా అదనంగా 20 టీఎంసీల నీటిని తరలించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.నగరం మధ్యలో ప్రవహించే మూసీ నదని పునరుద్ధరించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి వాటర్‌ బోర్డు ఒక భారీ ప్రాజెక్టును చేపట్టింది. మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ద్వారా నదికి పాత వైభవాన్ని తీసుకురావడానికి అధికారులు శ్రమిస్తున్నారు. 

వంద శాతం మురుగు శుద్ధి: పర్యావరణ పరిరక్షణలో మైలురాయి 

మురుగు నీరు నేరుగా చెరువులు, నదుల్లో కలవకుండా అడ్డుకోవడం నగర ఆరోగ్యానికి ముఖ్యం. దీని కోసం ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో 972 ఎంఎల్డీ సామర్థ్యం గల 39 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ప్రారంభమైంది. అమృత్‌`2.0 పథకంలో భాగంగా రూ. 3849.10 కోట్ల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నాయ. 

2026 నాటికి ఈ పనులు పూర్తి అయితే హైదరాబాద్‌ మొత్తం మురుగు నీటి శుద్ధి సామర్థ్యం 2,850 ఎంఎల్డీలకు చేరుకుంటుంది. 

ఇది 2036 వరకు నగర అవసరాలను తీర్చగలదని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాకుండా,మూసీ నదిలోకి మురుగు చేరకుండా ట్రంక్‌ లైన్లు వేసేందుకు 4700 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధమైంది. 

వేసవి సన్నాహాలు 

గత వేసవిలో భూగర్భ జలాలు 14 నుంచి 28 విూటర్ల వరకు పడిపోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండటానికి వాటర్‌ బోర్డు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఇంకుడు గుంతల యజ్ఞం ద్వార వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. నగరంలో నమోదైన భారీ వర్షాలు, బోర్డు చర్యల వల్ల భూగర్భ జలాలు గత ఏడాదితో పోలిస్తే 3 నుంచి 9 విూటర్ల వరకు పైకి వచ్చాయి. దీనిని మరింత ముందుకు తీసుకెళ్తూనే, 16వేల గృహాలకు నోటీసులు జారీ చేసి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వచ్చే మార్చి నాటికి మరో 25వేల గృహాల్లో వీటిని పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. 

నగరంలోని ప్రతి మూలకు నీరు చేర్చడానికి కొత్త ప్రాజెక్టును బోర్డు వేగవంతం చేసింది. 

1. కోకాపేట్‌ నీయోపోలిస్‌ లే అవుట్‌: 298 కోట్లతో వాటర్‌ సప్లై ప్రాజెక్టు 

2.మహీంద్రహిల్స్‌: 5మిలియన్‌ లీటర్ల రిజర్వాయర్‌ నిర్మాణం

3. ఆస్మానగ్‌: 7.5 మిలియన్‌ లీటర్ల రిజర్వాయర్‌ నిర్మాణం

4. మంజీరా నెట్‌వర్క్‌: 722 కోట్లతో నెట్‌వర్క్‌ ఆధునీకరణ

5. ఉస్మాన్‌ సాగర్‌ కండూట్‌: దీనిని పునరుద్ధరించి రోజుకు 21 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తరలించడానికి 282 కోట్లతో అదనపు పైపు లైన్‌ నిర్మాణం చేపడుతున్నారు.  

అంతే కాకుండా ఔటర్‌ రింగ్‌ రోడ్డు వెంట 140 కిలోవిూటర్ల మేర రేడియల్‌ రింగ్‌ మెయిన్‌, 98 కిలోవిూటర్ల లింకు పైపులైన్ల కోసం 8వేల కోట్లో భారీ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు చేపట్టిన ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయితే నీటి కరవు అనేది ఉండని ప్రభుత్వం భావిస్తోంది. 


iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....