20 రోజుల తర్వాత ముందస్తు పై క్లారిటీ

ఆగస్టు 15 నాటికి నియోజవర్గ రిపోర్టులు

హైదరాబాద్‌, జూలై  23, (ఇయ్యాల తెలంగాణ)

సర్వే సంస్థలకు సీఎం కేసీఆర్‌ డెడ్‌ లైన్‌ విధించారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. ఐప్యాక్‌తో పార్టీ జిల్లా అధ్యక్షులు, కొన్ని ప్రైవేటు సర్వే సంస్థలు నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహిస్తుండటంతో మరింత స్పీడ్‌ పెంచాయి. మండలాలు, మేజర్‌ గ్రామపంచాయతీల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి రిపోర్టులను తయారు చేయడంలో నిమగ్నమయ్యాయి. అయితే నివేదికల ఆధారంగా కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారా? లేకుంటే షెడ్యూల్డు ప్రకారమే ఎన్నికలకు వెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్‌.రాష్ట్రంలో అన్ని పార్టీలు స్పీడ్‌ పెంచాయి. కేసీఆర్‌ ముందస్తుకు వెళ్తారనే ప్రచారంతో ప్రతిపక్షాలు ప్రజలబాట పట్టాయి. కానీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాత్రం ఎన్నికల షెడ్యూల్డు ప్రకారమే అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్‌ సర్వే స్పీడ్‌ చేయాలని ఆయా సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. గ్రామస్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు పీకేకు చెందిన ఐప్యాక్‌తో ఒప్పందం కుదుర్చుకొని సర్వే నిర్వహిస్తుంది. గ్రామం నుంచి గ్రేటర్‌ దాకా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. మరోపక్క ప్రభుత్వం ఇంటిలిజెన్స్‌ తో సర్వే చేయిస్తూనే ఉంది. అంతేకాదు ఎమ్మెల్యేలు సైతం స్వతహాగా నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారు. ఏ గ్రామంలో, ఏ మండలంలో పార్టీకి అనుకూలంగా లేదో ఆ మండలాలపై దృష్టిసారించడంతో పర్యటనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఎన్నికలు వచ్చేనాటికి పూర్తి చేసి ప్రజల్లో అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నాలు చేపడుతున్నారు.మరో పక్కా జిల్లా అధ్యక్షులు సైతం తమతమ జిల్లాల్లో పార్టీ పరిస్థితి, ప్రతిపక్షాల ఉనికి, బలమైన అభ్యర్థులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరు, తదితర అంశాలపై సర్వే చేయిస్తున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయం, చేయాల్సిన పనులపై క్షుణ్నంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేల నివేదికలను ఆగస్టు 15 వరకు అందజేయాలని గులాబీ బాస్‌ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకోసం పార్టీ నేతలు సర్వేలను స్పీడ్‌ చేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.సర్వే రిపోర్టులు ఆగస్టు 15 వరకు ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశించడంతో ఏం చేయబోతున్నారనేది సస్పెన్స్‌ గా మారింది. టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించిన నాటి నుంచి కేసీఆర్‌ ఏం నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అంతుపట్టదు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు తప్ప మరొకరితో కూడా చర్చించరని పార్టీ సీనియర్‌ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలపై పట్టు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి కేసీఆర్‌ కావడంతో సందర్భానుసారం ప్రజల్లోకైనా, ఎన్నికలకైనా వెళ్తుంటారు. ఉద్యమ సమయంలో రాజీనామాలైనా, 2018లో ముందస్తు ఎన్నికలైనా ఎవరు ఊహించని పరిణామమే. అయితే ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారనేది ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేసీఆర్‌ ఎక్కడ ప్రస్తావించలేదు. కేటీఆర్‌ కూడా ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలను సైతం ఖండిరచారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పార్టీలు మాత్రం ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ సర్వే సంస్థలను నివేదికలు ఇవ్వాలని 15వ తేదీని నిర్దేశించడంతో అసలు ఏం జరుగబోతోందనేది అర్ధంకాని పరిస్థితి నెలకొంది. నివేదికల ఆధారంగా 2018లో వెళ్లిన మాదిరిగానే ముందస్తుకు వెళ్తారా? లేకుంటే ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందో అక్కడ పటిష్టతకు చర్యలు చేపడతారా? లేకుంటే బలమైన అభ్యర్థుల వివరాలను తెలుసుకుంటారా అనేది సస్పెన్స్‌ గా మారింది. ఏదీ ఏమైనప్పటికీ సర్వే సంస్థలు ఏం నివేదికలు ఇస్తాయోనని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నేతల్లో హాట్‌ టాఫిక్‌ గా మారింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....