నల్గోండ,జులై 6 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ ప్రభుత్వ పాఠశాల మూసివేత నిర్ణయంపై గ్రామస్థులు ఎదురు తిరిగారు. మా బడి మాకే.. మా సార్లు మాకే అంటూ ఉపాధ్యాయులను గంట పాటు నిర్బంధించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పిల్లల ను 2 కిలోవిూటర్ల దూరంలోని వల్లాల ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో చర్చించారు. 24 మంది విద్యార్థులే ఉన్నందున మూసివేస్తున్నారని ఉపాధ్యాయులు వివరించారు. వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎనిమిది మంది ఉపాధ్యాయులను స్టాఫ్ రూంలో నిర్బంధించి, బయట ధర్నాకు దిగారు. సర్పంచ్ బోడ నర్సయ్య, వివిధ పార్టీల నాయకులు వారికి మద్దతుగా నిలిచారు. జిల్లా అధికారులకు విన్నవించుకోవాలని సూచించడంతో వదిలేశారు. పాఠశాలను కొనసాగించాలని సర్పంచ్ నర్సయ్య ఎంఈవోను ఫోన్‌లో కోరారు. ఆయన తన పరిధిలో లేదని చెప్పడంతో, సర్పంచ్, గ్రామస్థులు నల్లగొండ వెళ్లి డీఈవో భిక్షపతిని కలిశారు.
150 మంది విద్యార్థులు ఉంటే పాఠశాలను కొనసాగిస్తామని, వారం రోజుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచితే స్కూల్‌ను కొనసాగిస్తామని డీఈవో చెప్పినట్లు సర్పంచ్ తెలిపారు. కాగా, ప్రారంభించి నెల అవుతున్నా విద్యార్థులు రాకపోకవడంతో బుధవారం మర్రిగూడ మండలం సరంపేటతండా ప్రాథమిక పాఠశాలను మూసివేనట్లు ఎంఈవో గురువారావు తెలిపారు. ఇక్కడ గత ఏడాది 11 మంది విద్యార్థులు ఉండేవారు. 5వ తరగతిలోని ఇద్దరు ఆరో తరగతిలో చేరారు. మిగిలిన 9 మందిలో ఆరుగురు హైదరాబాద్ వెళ్లిపోయారు. 3వ తరగతిలో ఇద్దరు, 4వ తరగతిలో ఒక్కరు నమోదు చేసుకున్నారు. ఒకటో తరగతిలో కొత్తగా ఒకరు చేరారు. 2, 5వ తరగతిలో విద్యార్థులు లేరు. వీరిలోనూ ఎవరో ఒకరిద్దరే రోజూ వస్తున్నారని ఎంఈవో తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడిని అంతంపేట పాఠశాలకు మార్చినట్లు చెప్పారు.