వీధి కుక్కల స్వైర విహారం….

హైదరాబాద్‌, జూలై 2, (ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్రంలో వీధికుక్కలు దాడులు ఆగడం లేదు. నగరాలతో పాటు పల్లెల్లో కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వీధి కుక్కల బారిన పడి గాయపడిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరులో ఒక్క జూన్‌ నెలలోనే 96 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అంటే కుక్కల బెడద ఎంత తీవ్రంగా ఉందో అర్ధమవుతుంది. ఈ కుక్కల దాడిలో చిన్న పిల్లలే కాకుండా మూగ జీవాలను సైతం వదలట్లేదని రైతులు వాపోతున్నారు.

జూన్‌ 28 శుక్రవారం రోజు పటాన్‌ చెరు మండలం ఇస్నాపూర్‌ లో వీధి కుక్కల గుంపు దాడిలో ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ఘటన ముత్తంగి గ్రామంలో 8 నెలల పసికందుపై కుక్క దాడి చేసింది. దీంతో ఆ చిన్నారి నీలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా శుక్రవారం ఒక్కరోజే పటాన్‌ చెరు మండలంలో ఐదు వీధికుక్క కాటు కేసులు నమోదయ్యాయని పటాన్‌ చెరు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ ప్రవీణ్‌ తెలిపారు. జూన్‌ 1 నుంచి 28 వరకు 96 వీధి కుక్కల దాడి కేసులు నమోదయ్యాయని, ఒక్క పటాన్‌ చెరు మండలంలోనే రోజుకు ముగ్గురికి పైగా వీధి కుక్కల కాటుకు గురవుతున్నారని ఆర్‌ఎంఓ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన కేసులే నమోదయ్యాయని, ఇంకా చాలామంది బాధితులు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కావున ఆ కేసులన్నీ నమోదైతే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని అయన పేర్కొన్నారు.ఈ క్రమంలో చిన్నారులను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వీధులలో కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ పిల్లలు, మహిళలతో పాటు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని కూడా వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో పాటు ఈ దాడులలో మూగ జీవాలు మేకలు, గొర్రెల సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. శనివారం చిన్న కోడూరు మండలం గోనెపల్లిలో ఓ రైతుకు సంబంధించిన గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయగా 14 గొర్రె పిల్లలు మృతి చెందాయి. కాగా సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నారు.ప్రతిరోజు మాంసం దుకాణాలలో వెలువడే మాంసం వ్యర్థాలను దుకాణదారులు నిర్లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. దీంతో వీధి కుక్కలు మాంసం వ్యర్థాలను తినడానికి అలవాటు పడుతున్నాయి. మాంసం వ్యర్థాలు దొరక్కపోతే అవి క్రూరంగా మారి చిన్న పిల్లలు, మేకలు, గొర్రెలపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్ధులు, గ్రామాలల్లో ఒంటరిగా తిరగాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఆయా ప్రాథమిక కేంద్రాలలో వందల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత ప్రజలు కోరుతున్నారు. జనన నియంత్రణ చర్యలు లేకపోవడంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతుందన్నారు.

కుక్క కాటు జాగ్రత్తలు`సూచనలు

కుక్క కరిచిన వ్యక్తి ఐదు సార్లు వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడో రోజు, 14వ రోజు, 28వ రోజు రేబిస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి.

కుక్క కరిచిన ప్రాంతంలో రక్తస్రావం అయితే ఈ వ్యాక్సిన్‌ తో పాటు రెండు రోజుల లోపు ఇమ్మ్యూనోగ్లోబిలిన్‌ ఇంజెక్షన్‌ ను కరిచినా చోట తీసుకోవాలి.

ఈ ఇంజెక్షన్‌ శరీరానికి ఇమిడియట్‌ బస్టర్‌ లా పనిచేస్తుంది. దీనివల్ల రేబిస్‌ వ్యాధి సోకకుండా ఉంటుంది.

రేబిస్‌ వ్యాధి సోకితే ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్‌ లేదని వైద్యులు తెలిపారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....