తెలంగాణలో బీజేపీ గెలుపు తథ్యమనే సంకేతాలను పంపుదాం
లక్ష మందికి తగ్గకుండా జన సవిూకరణ
ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారు
వారికి తగిన ఏర్పాట్లు చేసి బహిరంగ సభకు తీసుకురండి
బీజేపీ నేతలకు బండి సంజయ్ పిలుపు
జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలి కాన్ఫరెన్స్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఇయ్యాల తెలంగాణ) : ‘రేపు చేవెళ్లలో జరగబోయే ‘‘విజయ సంకల్ప సభ’’ తెలంగాణలో సంచలనం కావాలి. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న ఈ సభకు లక్ష మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలి. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను ఈ సభ ద్వారా పంపాలి’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఈరోజు జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బండి సంజయ్ ఆదివారం చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త క్రుషి చేయాలని కోరారు.
పార్లమెంట్ పరిధిలో జరగబోయే తొలి సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే నమ్మకాన్ని జాతీయ నాయకత్వానికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నియంత, నిక్రుష్ణ, అవినీతి పాలన కొనసాగుతోందని, కేసీఆర్ వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలంతా బీజేపీపట్ల నమ్మకంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో పార్టీని అణిచివేసేందుకు సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉందని, అయినా ప్రజలు, పార్టీ అండగా ఉన్నందుకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదన్నారు.
కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందని, తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. చేవెళ్ల సభ ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం… రామరాజ్య స్థాపన తథ్యమనే సంకేతాలను పంపబోతున్నట్లు చెప్పారు. ఈ సభను సక్సెస్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ విూడియా, సోషల్ విూడియా వేదికగా విస్త్రత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు.