తెల్ల రేషన్‌ కార్డుదారులందరికి భీమా కల్పించాలి

జగిత్యాల ఆగష్టు  9 (ఇయ్యాల తెలంగాణ ):తెల్ల రేషన్‌ కార్డుదారులందరికి భీమా కల్పించాలని, ప్రభుత్వానికి మత్స్యకారులకు మధ్య దళారులను తొలగించాలని, చేప పిల్లల పెంపకం కోసం నేరుగా మత్స్యకారులకే నగదు అందజేయాలని, మత్స్య కారులను ఆదుకోవాలని కోరుతూ శాసనమండలిలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌ లో బుధవారం మత్స్య కారులు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్‌ రెడ్డిని మత్స్యకారులు కలిసి అభిమానంతో చేపలు అందజేసి, శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ కుల వృత్తులు ప్రోత్సహించాలని స్వయం ప్రతిపత్తి కల్పించాలని సహకార సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలం పద్దతి రద్దు చేసి, మత్స్య కార్మికులకు చెరువులు, కుంటలపై ఆధిపత్యం కల్పించామని తెలిపారు. చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, మత్స్య కారులు సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగానని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అన్నారు. ఇటీవల వరదలకు రైతుల తోపాటు మత్స్య కార్మికులు తీవ్రంగా నష్ట పోయారని, వరదలకు చెరువుల మత్తల్లు దుముకడంతో చేపలు కిందికి వెళ్లి పోవడంతో టమాటా రు.200లకు కిలో అయితే చేపలు రు.100 రుపాయలకు అమ్ముకున్నారని శాసన మండలిలో మాట్లాడినట్టు తెలిపారు. రోల్లవాగు ప్రాజెక్ట్‌ కు గండిపడి కోట్లాది విలువైన చేపలు కొట్టుకు  పోయాయని, వందలాది మంది మత్స్య కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందలేదన్నారు. వరదలకు నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చేప పిల్లలు ఆలస్యంగా పంపిణీ చేస్తుండడంతో చేపలు పెరగడం లేదని, గిట్టుబాటు కాలేదన్నారు. చేప పిల్లలు పెంచేందుకు చెరువుల సామర్థ్యాన్ని బట్టి నగదు మత్స్యకార్మికులకే ఇవ్వాలన్నారు. జగిత్యాల ధర్మ సముద్రం చెరువులో నామినేషన్‌ పద్దతిలో మత్స్య కార్మికులకు అప్పగించామన్నారు. రాయికల్‌ పెద్ద చెరువును మత్స్య కార్మికులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కులవృత్తికి సంభందించి రైతులకు కల్పించే ఆర్థిక సహాయం సమాజంలో కులవృత్తులపై ఆధార పడిన నిరుపేద లందరికీ భీమా వర్తింపజేయాలన్నారు. మత్స్య కారులు వృత్తిలో మృతి చెందితేనే భీమా ఇస్తుండటంతో ఇతర కారణాలతో కుటుంబ పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. భీమా వర్తింపులో అత్యంత నిరుపేద వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న నిరుపేదలందరికీ భీమా వర్తింపజేయాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు తోపారాపు రజనీకాంత్‌, గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు దేశవేని రాజేష్‌, కాంగ్రెస్‌ మత్స్య శాఖ విభాగం రాష్ట్ర కార్యదర్శి రుత్త నారాయణ, రాయికల్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తోపారపు రవీందర్‌, గోవిందారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తోకల నర్సయ్య, పసునూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌, రాయికల్‌ మండలం మత్స్యశాఖ విభాగం అద్యక్షుడు పల్లికొండ రమేష్‌, బీర్‌ పూర్‌ మండల కాంగ్రెస్‌ మత్స్యశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌, వెల్గటూర్‌ మత్స్య శాఖ కాంగ్రెస్‌ అద్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, చేర్ల కొండాపూర్‌ గ్రామ అద్యక్షుడు రాజేందర్‌, రాజేశం, శ్రీహరి, శివ, ఎలుకబావి వాడ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కండ్లపెల్లి రాజయ్య, భీమయ్య, కిరణ్‌, ఉమ్మడి కరీంనగర్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్‌ వెంపేట గంగాధర్‌ పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....