గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు అల్లూరి

నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడని కొనియాడిన సిఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ జూలై 4, (ఇయ్యాల తెలంగాణ ): బ్రిటీష్‌ బానిస బంధాల్లో చిక్కుకుని భారతజాతి నలిగిపోతున్న వేళ విప్లవజ్యోతి అయి అవతరించిన వీర యోధుడు మన అల్లూరి సీతారామరాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. అన్నెంపున్నెం ఎరుగనటువంటి మన్యం బిడ్డల కన్నీరు తుడిచి, గడ్డిపరకలను గడ్డపారలుగా మార్చిన మహాయోధుడు మన అల్లూరి అని కొనియాడారు. ఆయన భారతమాత గర్వించేటటువంటి ఉత్తమ తనయుడు, నిర్మల దేశభక్తుడు, నిజమైన యోగి పుంగవుడు అల్లూరి అని కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు.ఆ మహానీయుడి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం యావత్‌ జాతి కర్తవ్యం అని కేసీఆర్‌ తెలిపారు. ఈ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధలతో నిష్ఠతో నిర్వహించిన క్షత్రియ సేవా సమితిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఈ ఉత్సవాలు అల్లూరి సీతారామరాజు పోరాట చైతన్యాన్ని, దేశభక్తిని కొత్త తరానికి ఘనంగా చాటిచెబుతాయని నేను విశ్వసిస్తున్నాను. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం చాలా సముచితం. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, నేను పాల్గొనడం జరిగింది అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఉద్యమ సందర్భంలో అల్లూరి పాటను అనేక సార్లు విన్నా..యాక్టర్‌ కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా నిర్మించి ఉండకపోతే, అందులో శ్రీశ్రీ లాంటి మహాకవి తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా.. మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా.. అనే పాట కూడా చాలాచాలా పాపులర్‌ అయింది అని కేసీఆర్‌ గుర్తు చేశారు. అల్లూరి ప్రేమికులందరు కూడా ఆ పాటను నిరంతరంగా వింటారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఈ పాటను నా కారులో అనేకసార్లు పెట్టుకుని విన్నాను అని కేసీఆర్‌ తెలిపారు.

మన అల్లూరిది చాలా గొప్ప చరిత్ర..

మార్జినలైజ్‌డ్‌ సెక్షన్ల విూద ఎప్పుడైతే దాడి సంభవిస్తదో అప్పుడు కొందరు వీరులు ఉద్భవించి వాళ్లకు శాంతి కలుగజేస్తరు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. చాలా గొప్ప చరిత్ర మన అల్లూరిది. చాలా చిన్న వయసులో అంత పెద్ద ప్రేరణ వారికి ఎలా కలిగిందో అందుకే నేను దైవాంశ సమ్మితులు అని చెప్పింది. అంత పిన్న వయసులో ఆ ప్రజలు పడే బాధలు చూడలేక, వారు ఆ యుద్ధరంగంలో దూకి 26 సంవత్సరాల కాలంలోనే రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచాడు. భారతజాతి గర్వంగా చెప్పుకునే అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు.. భగత్‌ సింగ్‌ కావొచ్చు, ఆజాద్‌ చంద్రశేఖర్‌ కావొచ్చు.. సుభాష్‌ చంద్రబోస్‌ కావొచ్చు.. వారి సరసన మేము తక్కువకాదు అని మన తెలుగు జాతిని నిలబెట్టి, మనందరం గర్వించేటటువంటి మహానీయుడు మన అల్లూరి సీతారామరాజు. మేం తక్కువ కాదు అని నిరూపించిన వారి త్యాగనిరితిని, చివరకు చనిపోతూ కూడా దేశం గురించే మాట్లాడి, దేశం కోసం ప్రాణాలర్పించారు అని కేసీఆర్‌ గుర్తు చేశారు.

ఆ మహానీయుడి పోరాటం వల్లే గౌరవంగా ఉన్నాం..మహాత్మాగాంధీ అహింస సిద్ధాంతాన్ని ప్రవచించిన వ్యక్తి.. అయినప్పటికీ ఆయన కూడా అల్లూరి సీతారామరాజును ప్రశంసించకుండా ఉండలేను అని గాంధీ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అది రికార్డు అయి ఉంది అని కేసీఆర్‌ గుర్తు చేశారు. అటువంటి మహానీయుడు చేసినటువంటి ఆ పోరాటం వల్ల మనందరం ఇవాళ గౌరవంగా, సమున్నతంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాం. ఈ ఉత్సవాలను గౌరవంగా చేపట్టి, ఈ అమృత్‌ మహోత్సవ్‌లో అల్లూరి సీతారామరాజును చేర్చి, వారికి తగినటువంటి గౌరవాన్ని కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి తెలుగు జాతి ప్రజలందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నాను అని కేసీఆర్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....