రంగారెడ్డి , జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : అకాల మరణం చెందిన,తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యా రు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా…సార్ సాయిని పిలువండి. లెమనండి..విూరు పిలిస్తే లేచివస్తాడు..సార్..’’ అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సీఎంకు కష్టంగా మారింది..దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు.నేనున్నానంటూ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి తదితర ప్రజాప్రతినిధులు వచ్చి నివాళులు అర్పించారు..