ఎకరం 100 కోట్లు… ప్రగతికి నిదర్శనం

హైదరాబాద్‌, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : ప్రభుత్వం నిర్వహించిన వేలంలో హైదరాబాద్‌ భూములకు అత్యధిక ధర లభించింది. ఈ వేలంలో ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలన్నారు. ఇంతింతై వటుడిరతై అన్నట్లుగా హైదరాబాద్‌ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి.. హైదరాబాద్‌ ఆత్మ గౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

ఎవరెంత నష్టం చేయాలని చూసినా.. ధృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్‌ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని ఆయన అన్నారు.హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్‌ ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్‌ను, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభినందించారు.ప్రభుత్వ నిర్ణయం మేరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో గురువారం జరిగిన భూముల ఈ వేలం ద్వారా జరిగిన విక్రయంలో దేశ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు పాల్గొనన్నాయి. 

ఈ సందర్భంగా జరిగిన వేలంలో తెలంగాణ భూములకు కనీవినీ ఎరుగని ధర పలికింది.రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియో పోలీస్‌ ఫేస్‌ 2లో జరిగిన వేలంపాటలో ఎకరానికి రూ. 100.75 కోట్లను చెల్లించి పోటీదారులు ప్లాట్లను సొంతం చేసుకున్నారు. దీంతో దేశంలోకెల్లా అత్యంత ఖరీదైన భూమిగా కోకాపేట రికార్డు నెలకొల్పింది. కోకాపేట నియోపోలీస్‌ భూముల ఈ వేలంలో ఎకరం రూ. 100 కోట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్లాట్‌ నెంబర్‌ 10లో ఒక ఎకరం భూమి ధర రూ.100.75కోట్లు పలికింది. ప్లాట్‌ నెంబర్‌ 11లో ఎకరం రూ. 58.25 కోట్లు పలికింది. నిధుల సవిూకరణలో భాగంగా హెచ్‌ఎండీఏ గురువారం భూముల వేలం ప్రక్రియను చేపట్టింది. కోకాపేట్‌లోని నియో పోలీస్‌ లే అవుట్‌లో మొత్తం 45.33 ఎకరాలను వేలం వేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....