ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి : Dist కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌, ఫిబ్రవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : రానున్న రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. ఎండల తీవ్రత, జాగ్రత్త చర్యలపై జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వేసవిలో నీటిని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువసార్లు నీళ్లు తాగేలా చూడాలన్నారు.

ప్రతి ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని, కేంద్రాలకు వచ్చే వారికి ఓఆర్‌ఎస్‌ ద్రావణం అందించాలని అన్నారు. వృద్ధాశ్రమాల్లో ఉంటున్న వారికి నిమ్మరసం అందించాల్సిందిగా నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్‌ నిలిపివేయాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నిలిపివేయాలని ఎలక్ట్రిసిటీ అధికారులను ఆదేశించారు. వేసవిలో మొక్కలకు మల్చింగ్‌ చేసి సంరక్షించాలని సూచించారు.

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో ప్రజలు ఏమి చేయాలో ఏమి చేయకూడదో సూచించే పోస్టర్లను జన సందోహం ఉండే ప్రాంతాల్లో అతికించాలన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కిట్‌ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత కారణంగా మెడికల్‌ ఎమర్జెన్సీ ఏర్పడితే 108కి కాల్‌ చేయాలన్నారు.

ప్రజలు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, మసాలా పదార్థాలు తగ్గించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని, అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఎండ తీవ్రత జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్‌ ను ఆవిష్కరించారు.

 ఈ సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు ప్రపుల్‌ దేశాయ్‌, లక్ష్మీ కిరణ్‌, ట్రైనీ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సబిత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....