👉 భవిష్యత్ తరాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరి
👉మొక్కలు నాటడం జీవితంలో ఒక భాగం కావాలి
👉పర్యావరణాన్ని పరిరక్షించేందుకు దోహదపడతాయి
👉ఇంటికి ఆరు చొప్పున మొక్కలు నాటాలి
👉వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలి
👉రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
👉శాతవాహన యూనివర్సిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జులై 15 (ఇయ్యాల తెలంగాణ) : వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాన్ని కాపాడుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి మండలం చింతకుంటలోని శాతవాహన యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన 75 వనమహోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ వన మహోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నదని తెలిపారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సంజయ్ గాంధీ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాన్ని కాపాడు కునేందుకు, పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు తప్పనిసరిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలు విధిగా నాటాలని, వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల్లో అవసరమైన పూలు, పండ్ల మొక్కలను అధికారులు అందిస్తారని తెలిపారు. ప్రజల సహకారంతోనే మొక్కల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. యూనివర్సిటీ నిర్మాణం సందర్భంగా ఇన్ని మొక్కలు కనిపించలేదని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయంలో యూనివర్సిటీ శంకుస్థాపన జరిగిందని తెలిపారు. అప్పుడు తాను మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఉన్నానని పేర్కొన్నారు. 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ కేటాయించడం జరిగిందని తెలిపారు. అప్పుడు కేసిరెడ్డితో పాటు అధికారులను తీసుకొచ్చి స్థల సేకరణతో పాటు యూనివర్సిటీ నిర్మాణానికి కృషి చేశామని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటేందుకు అధికారులు, విద్యార్థులు, సిబ్బంది కృషి చేయాలని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 43 లక్షల మొక్కల పెంపకానికి ప్రభుత్వం లక్ష్యం విధించిందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. మొక్కలు నాటడం ప్రభుత్వ కార్యక్రమమే కాకుండా ప్రజలు తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మొక్కకు అధికారులు జియో టాకింగ్ చేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే మొక్కలే నాటాలని, ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆక్సిజన్, నీడ, పండ్లు పూలు అందించే మొక్కలు నాటాలని సూచించారు. తల్లి పేరు విూద, కుటుంబ సభ్యుల పేరు విూద, ఇష్టం వచ్చినవారు పేర్ల విూద మొక్కలు నాటవచ్చని పేర్కొన్నారు. మొక్కలను సంరక్షించే బాధ్యతను అందరు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ వరప్రసాద్, ఆర్డీఓ కే మహేశ్వర్, డీఆర్డిఓ శ్రీధర్, డిఎఫ్ఓ బాలమణి, తహసిల్దార్ రాజేష్, ఎంపీడీవో ప్రభు, ర్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.