గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితులకు చికిత్స
కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు: మంత్రి ఈటెల
హైదరాబాద్ ,మే 8 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 376 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,132కు చేరిందన్నారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదని మంత్రి ఈటెల విూడియాకు వివరించారు.
కేంద్రం నిబంధనల ప్రకారం మరో 14 జిల్లాల్లో కరోనా లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచే కొత్తగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కేంద్రం మార్గదర్శకాలతో అనేక జిల్లాలు గ్రీన్జోన్ల లోకి వెళ్లాయి. లాక్డౌన్.. కేంద్రం ఈనెల 17 వరకు అని చెప్పినా తెంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 29 వరకు పొడిగించారు. కరోనా రాకుండా ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాలు గ్రీన్జోన్లో ఉన్నాయి. మరో 14 జిల్లాలు గ్రీన్జోన్లో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. సోమవారం కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి సరిహద్దుల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటె రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయగలిగామని చెప్పారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్ కరోనాపై సవిూక్ష చేస్తున్నారని విలేకరుల సమావేశంలో మంత్రి వివరించారు. ’గాంధీ, ఉస్మానియాలో అన్ని సేవలు కొనసాగుతాయి. పాజిటివ్ కేసులు వచ్చిన ఇళ్లలో కరోనా నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ముందు జాగ్రత్తలు తీసుకుని సేవలు కొనసాగించాలని సూచించాం. కరోనా పరీక్షలు చేయడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదు. 75ఏళ్లు దాటిన వ్యక్తి, డయాలసిస్ రోగి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవుతున్నారు. కరోనా సోకిన గర్బిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మన వైద్యులు గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని చెప్పారు. కరోనా పరీక్షలు చేయడం లేదనే ఆరోపణలు అబద్ధమని కేంద్రానికి చెప్పాం. సూర్యాపేట, వరంగల్(అర్బన్), నిజామాబాద్ జిల్లాలను ఆరెంజ్ జోన్లలో చేర్చాలని కేంద్రాన్ని కోరాం. కంటైన్మెంట్ జోన్లలో కరోనాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మాత్రమే రెడ్జోన్లుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
కరోనా గర్భిణికి గాంధీలో చికిత్స
ఇదిలావుంటే కరోనా సోకిన ఓ గర్బిణి హైదరాబాద్ గాంధీ దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సోకడంతో తల్లి ఆరోగ్య, మానసిక స్థితిపై ఆందోళనగా ఉండేది. అయితే గర్భిణికి వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలతో శస్త్ర చికిత్స చేశారు. తల్లీ బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్యులు ఎప్పటికప్పుడు మెరుగైన వైద్యం అందిస్తూ కంటికి రెప్పలా చూసుకున్నారు. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించడంతో ఆ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు..