జగిత్యాల జూన్ , 27 ,(ఇయ్యాల తెలంగాణ ):జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ `4 పరీక్షను ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జూలై 01న టిఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 4 పోటీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం రోజున సవిూకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. జూలై ఒకటిన రెండు పూటలు నిర్వహించే గ్రూప్ 4 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అన్నారు. లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు కేంద్రాలను పరిశీలించాలని, సీటింగ్, లైటింగ్, మరుగుదొడ్లు, త్రాగునీరు, సిసి కెమెరాలు వంటివి పరిశీలించాలని అన్నారు. వర్షా కాలం కారణంగా రూట్ లో ఇబ్బందులు తలెత్తకుండా, ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. టిఎస్పీఎస్సీ గైడ్ లైన్స్ ప్రతీ ఒక్కరు చదవాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 73 కేంద్రాలలో 21,937 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ప్రతీ కేంద్రంలో ఆశ, ఎఎన్ఎం లను, అవసరమైన మందులను సమకూర్చాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు రవాణాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా అన్ని రూట్లలో పరీక్ష సమయానికి ముందే బస్సులను నడిపించాలని తెలిపారు. కేంద్రాలలో పారిశుధ్య పనులు మునిసిపల్, పంచాయతీ సిబ్బంది చే నిర్వహించాలని అన్నారు. మిషన్ భగీరథ నీటిని ఆయా కేంద్రాలకు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహిళా అభ్యర్థులను మహిళా పోలీసు సిబ్బంది తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు.అదనపు కలెక్టర్ బి.ఎస్.లత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 73 కేంద్రాలలో 21,937 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని, ఆయా కేంద్రాలకు కేటాయించిన అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు సీటింగ్ ఏర్పాట్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఇన్విజిలేషన్ డ్యూటీ లు వేయాలని, కేంద్రాలలో మౌలిక సదుపాయాలు వంటి ఏర్పాట్లు చేయాలని అన్నారు. పరీక్ష రోజున ఉదయం 7.30 గంటలకే లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు ఆయా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. టీఎస్పీఎస్సీ జారీచేసిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని అన్నారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులను కేంద్రం లోకి నిశిత పరిశీలన చేసి పంపించాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గాని, ఖరీదైన వస్తువులను కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు, జీరాక్స్ కేంద్రాలను మూసి వేయడం జరుగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ లు ఆయా కేంద్రాల్లో హాజరైన, ఆబ్సెంట్ అయిన అభ్యర్థుల వివరాలు తెలియజేయాలని అన్నారు. వోఎంఆర్ సీట్ పై అభ్యర్థి వేలి ముద్రలు తీసుకోవాలని తెలిపారు. ఏయే సమయానికి విధులు నిర్వహించాలి,వోఎంఆర్ సీట్ ల పంపిణీ, తదితర అంశాలపై పూర్తిగా వివరించారు. ఎలాంటి ఆభరణాలు ధరించకూడదని, చెప్పులు మాత్రమే ధరించాలని తెలిపారు. అందరి సహకారంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఆర్డీవో వినోద్ కుమార్ మాట్లాడుతూ, లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు సమన్వయం చేసుకుంటూ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. డీఎస్పీ ప్రకాష్ మాట్లాడుతూ, పరీక్ష రాసే అభ్యర్థులను నిశిత పరిశీలనకు పురుషులు, మహిళా పోలీసు సిబ్బందిని విడివిడిగా నియమిస్తామని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉంటే పోలీసు అధికారులకు తెలియజేయాలని తెలిపారు. బందోబస్తు లో పోలీసు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. మెట్ పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతీ అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించబోమని తెలిపారు. ఈ సమావేశంలో రవీందర్ కుమార్ , వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్ లు, ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, తదితరులు పాల్గొన్నారు.