వీరన్నగుట్ట ప్రాంతంలో 600 గజాల స్థలం పరిరక్షణ
వెంటనే బౌండ్రి ఏర్పాట్లు చేసిన HMDA
హైదరాబాద్ జులై 10, (ఇయ్యాల తెలంగాణ ): విలువైన దాదాపు 600 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ అంశం దృష్టికి వచ్చిన వెంటనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) రంగంలోకి దిగి పరిరక్షించింది.రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, బాగ్ హయత్ నగర్ రెవెన్యూ గ్రామం పరిధిలోని వీరన్నగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంతంలో సర్వేనెంబర్ 195/1 లోగల 10 ఎకరాల 11 గుంటల ప్రభుత్వ భూమిని పరిరక్షణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండిఏకు అప్పగించింది. ఈ ప్రాంతంలో కొందరు వ్యక్తులు తాము కోనుగోలు చేసిన ప్లాట్ విస్తీర్ణానికి మించి హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న స్థలాన్ని కూడా తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు. హెచ్ఎండిఏ సైట్ ఆఫీసర్ ఈ విషయాన్ని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) కిషన్ రావు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 7 గంటలకు హయత్ నగర్ ఎమ్మార్వో వివి శర్మ, హెచ్ఎండిఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్మోహన్ రావు, సైట్ ఆఫీసర్ పి. రాఘవేంద్రరావు, హెచ్ఎండిఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం, సర్వేయర్లు సంయుక్తంగా హద్దులను నిర్ధారించి, ఆక్రమణలను తొలగించి సరిహద్దు(బౌండ్రి)లను ఏర్పాటు చేశారు.