
న్యూఢిల్లీ, ఆగస్టు 16, (ఇయ్యాల తెలంగాణ) : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగ్దీప్ ధన్కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తుంది. ఇప్పుడు కాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమికి చెందిన అభ్యర్థే గెలుపొందే అవకాశాలు ఉన్నందున.. ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి.. నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంట్ ఉభయసభల్లో సభా నాయకులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. అయితే బీజేపీలోని అత్యుతన్న నిర్ణయాత్మక విభాగం (బీజేపీ పార్లమెంటరీ బోర్డు) ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ నెల 17న సాయంత్రం గం. 6.00కు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది.ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాలలో ఒకటిగా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరగనుంది. ఇటువంటి ఎన్నిక్లో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితుల్లో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదనుపెట్టి సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది.

ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సవిూకరణాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటులో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే.. రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీ(యూ), ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్పీఎఫ్ మరియు ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీయే బలాన్ని 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కు చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు.ఇక లోక్‌సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాల 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీయే బలం 293కు చేరుతుంది. రెండు సభలు కలిసి ఓటు వేసినప్పుడు, విజయానికి అవసరమైన సింపుల్ మెజారీటీని ఎన్డీయే సులభంగా అధిగమిస్తుంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి లో కాంగ్రెస్ నుంచి 99 లోక్‌సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడం కష్టం.భారత ఉపరాష్ట్రపతి, పార్లమెంటులోని రాజ్యసభకు ఎక్స్`అఫీషియో చైర్మన్ కావడం వల్ల ఈ పదవికి అభ్యర్థిని ఎంపిక చేయడం అధికార కూటమికి వ్యూహాత్మకంగా మారుతుంది. ఎందుకంటే రాజ్యసభలో ప్రతిపక్షాలను అదుపుచేస్తూ సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో ఆ పదవిలో కూర్చునే వ్యక్తి శక్తి, సామర్థ్యాలు కీలకంగా మారతాయి. అన్నీ ఆలోచించి నాడు ఉపరాష్ట్రతిగా జగ్దీప్ ధన్కడ్ను ఎంపిక చేసినప్పటికీ.. ఆయన తన అధికార పరిధిని అతిక్రమించి ప్రభావం చూపాలని ప్రయత్నించారనే ఊహాగానాలు చర్చలోకి వచ్చాయి. అప్పట్లో ఉత్తరాదిన హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, వంటి రాష్ట్రాల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపగలిగే శక్తి, సంఖ్యాబలం కలిగిన జాట్ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకుని దగ్గర చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆ సామాజికవర్గంలో పలుకుబడి కల్గిన విద్యావంతుడు జగ్దీప్ ధన్కడ్ను ఎంపిక చేసినట్టు కథనాలు వచ్చాయి. గతాన్ని పక్కనపెట్టి.. వర్తమానంలోకి వస్తే.. కొత్త ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మోదీ, నడ్డాలు ఎన్నికల లెక్కలు, అంచనాలు, ఊహాగానాలకు అతీతంగా ఆలోచించే అవకాశం ఉంది. కీలకమైన పదవుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం అందరి ఊహలను తలకిందులు చేస్తూ.. ఎవరూ ఊహించని వ్యక్తులను చివరిక్షణాల్లో తెరపైకి తెచ్చిన ఉదాహరణలు కోకొల్లలు. ఈసారి ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎలాంటి సవిూకరణాలకు ప్రాధాన్యత ఇస్తారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్నప్పుడైనా, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో కూటమిగా అధికారంలో ఉన్నప్పుడైనా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలైనా.. గవర్నర్లుగా పనిచేసినవారినో, కేబినెట్ మంత్రులుగా ఉన్నవారినో ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా వివిధ నేపథ్యాల నుంచి వచ్చినవారు సైతం ఈ పదవిని నిర్వహించారు. మోదీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి తన కేబినెట్లో మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గవర్నర్‌గా పనిచేసిన జగ్దీప్ ధన్కడ్కు అవకాశం కల్పించారు. కానీ ఈసారి కచ్చితంగా ఈ తరహా నేపథ్యాలు కల్గినవారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహించే పరిస్థితి లేదు.దశాబ్దకాలంగా బీజేపీ అనుసరించిన విధానాలు, వ్యూహాలను గమనిస్తే.. కీలక పదవులకు ఎంపిక చేసే అభ్యర్థుల ద్వారా రాజకీయంగా బీజేపీ పాదముద్రలను విస్తరించడానికి ఉపయోగించుకుంది. 2017లో ఉత్తరప్రదేశ్ నుంచి దళిత నాయకుడు రామ్ నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిగా ఎన్నుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎం. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా ఎన్నుకుని, ఉత్తర ? దక్షిణ భారతదేశ సమతుల్యత పాటించింది.2022లో ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవడంతో, రాజస్థాన్ జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖర్‌ను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. విభిన్న భౌగోళిక ప్రాంతాలు, కులాలు, సముదాయాలను కవర్ చేసే ఈ రొటేషన్ లాజిక్ ఒక అలిఖిత నియమంగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి, తన సంస్థాగత నిర్మాణాన్ని సవిూక్షించడానికి సిద్ధమవుతున్న వేళ అకస్మాత్తుగా ఉపరాష్ట్రపతి ఎన్నిక తెరపైకి వచ్చింది. దీంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ద్వారా ఏర్పడే ఖాళీ, బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కసరత్తు.. ఇవన్నీ కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులు, చేర్పులకు ఆస్కారం కల్గించనుంది. ఉదాహరణకు 2017 మాదిరిగా కేబినెట్ మంత్రిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెడితే.. ఆ స్థానాన్ని భర్తీ చేయడం ద్వారా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనివార్యంగా మారుతుంది.ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి కచ్చితంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు నేపథ్యం కలిగినవారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యం లేనివారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్‌ను గవర్నర్‌గా చేస్తే.. ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించారు. ఆ తర్వాత జగ్దీప్ ధన్కడ్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి, విధేయతను ప్రదర్శించే వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది.ఈ సవిూకరణాల ప్రకారం బిహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌కు అవకాశాలను సన్నగిల్లాయి. మితవాద ముస్లిం వర్గాలను ఆకట్టుకోడానికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎంపిక ఒక వ్యూహాత్మక మార్గమని కొందరు సూచిస్తున్నప్పటికీ.. ఖీూూ నేపథ్యం లేకపోవడం ఆయకు మైనస్ పాయింట్‌గా మారింది. మ ఎవరిని తెరపైకి తెస్తారు అన్న చర్చ తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది.ప్రతిపక్షం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి, ఎన్డీఏ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఒక కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది. కానీ ఎన్డీఏ సంఖ్యాబలం కారణంగా, ఈ పోటీ కేవలం పేరుకే తప్ప ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని ఆ కూటమి నేతలందరికీ తెలుసు. అయితే అధికార కూటమికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడానికి, తమ ఓటుబ్యాంకును కాపాడుకోడానికి ఈ ఎన్నికలను ప్రతిపక్ష కూటమి ఒక సాధనంగా మార్చుకోవాలని చూస్తోంది.