స్లో Poison తో చంపేస్తున్నారు

హైదరాబాద్ , మార్చి 27 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్ నగరవాసుల ప్లేట్లలోకి చేరుతున్న ఆహారం స్వచ్చమైనది కాదు. ఓ పకడ్బందీ కల్తీ మాఫియా ప్రజలకు విషాన్ని పంచుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ , పోలీసులు జరుపుతున్న ఆకస్మిక దాడులు సామాన్యులను ద్రిగ్భ్భాంతికి గురిచేస్తున్నాయి. బ్రాండెడ్ అవుట్‌లెట్ల నుంచి గల్లీలోని బేకరీల వరకు.. అన్నీ కల్తీ మయం అనే నిజం వెలుగు చూస్తోంది.హైదరాబాద్‌లోని కాటేదాన్, ముషీరాబాద్, బేగంబజార్ వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన దాడులు ఆహార రంగంలోని చీకటి కోణాన్ని బయటపెట్టాయి. మురిగిపోయిన కోడిగుడ్లతో కేకులు, డోనట్లు తయారు చేయడం.. నాసిరకం కొబ్బరి పొడిని బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి విక్రయించడం వంటి దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం చిన్న హోటళ్లే కాదు, హల్దీరామ్ వంటి పేరున్న బ్రాండెడ్ అవుట్‌లెట్లలో కూడా గడువు తీరిన స్వీట్లు, బూజు పట్టిన పదార్థాలు విక్రయిస్తుండటం పౌర సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. టీ పౌడర్‌లో రంగులు, కొబ్బరి పీచు కలపడం.. కుళ్ళిన మాంసాన్ని ఐస్ పెట్టి నిల్వ ఉంచి హోటళ్లకు సరఫరా చేయడం వంటివి చూస్తుంటే మనం తింటున్నది ఆహారమా లేక విషమా అన్న అనుమానం కలుగుతోంది.ఎఫఎసఎసఏఐ నిబంధనలు కాగితాలకే పరిమితం కావడంతో, కల్తీ రాయుళ్లు బరితెగిస్తున్నారు.

కనీస లైసెన్సులు లేని యూనిట్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రమే హడావిడి కనిపిస్తోంది కానీ, ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మొదటికే వస్తోంది. కల్తీ టీ పొడి, కుళ్ళిన గుడ్లు, రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు బేకరీ ఐటమ్స్ తిని ఫుడ్ పాయిజనింగ్‌కు గురవుతున్నారు. సోడియం బెంజోయేట్, సింథటిక్ రంగుల వంటి ప్రమాదకర రసాయనాల వాడకం క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తోంది. పండుగల సమయాల్లో ఈ కల్తీ మాఫియా మరింతగా విజంభిస్తోంది.కల్తీ చేసే వారికి కేవలం జరిమానాలు విధిస్తే సరిపోదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేయాలని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వంటి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. వారు చేస్తున్నది కూడా అదే. నమ్మి కొనుగోలు చేసి తింటోంది ఆహారం కాదు..స్లోపాయిజన్ అని తెలిసే సరికి మొత్తం నష్టం జరిగిపోతుంది. ఆరోగ్యం పాడవుతుంది. అటువంటి అవుట్‌లెట్లను శాశ్వతంగా మూసివేసి, వారి ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలి. ఆహార భద్రత విషయంలో రాజీ పడితే, అది భావి తరాల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....