న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ బుధవారం విడుదల అయింది. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 10 రాష్టాల్లో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఈ రాజ్యసభ ఖాళీ కానున్న స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. పది రాష్టాల్లో మొత్తం 37 రాజ్యసభ ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 9కి తెలంగాణ నుంచి కేఆర్ సురేశ్‌రెడ్డి, అభిషేక్ సింఘ్వీల రాజ్యసభ పదవీ కాలం పూర్తికానుంది. తమిళనాడులో ఆరుగురు, బెంగాల్లో అయిదుగురు, బిహార్‌లో అయిదుగురు, ఒడిశాలో నలుగురు, అస్సాంలో ముగ్గురు, చత్తీస్ఘడ్, హర్యానాల్లో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ సీటు ఖాళీ కాబోతున్నాయి.
రాజ్యసభ నిరంతర సభ కాగా, అందులో 37 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుందని తెలిసిందే. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 26న ఈసీ విడుదల చేయనుంది. మార్చి 5 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. మార్చి 9వ వరకు దరఖాస్తులు విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 16వ తేదీన ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ప్రక్రియ విజేతను ప్రకటిస్తారు.
