ముంబై, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) : మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గణనీయమైన ప్రభావాన్ని చాటుకుంది. కేవలం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకే పరిమితం కాకుండా.. పట్టణాల్లో కూడా తన ఉనికిని చాటుకుంటూ పలు చోట్ల నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండటం గమనార్హం. ఇక బీఎంసీ పరిధిలో తొలిసారి ఎంఐఎం బోణీ కొట్టింది.ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)లో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తన పట్టణ ప్రాబల్యాన్ని చాటుకుంది. ముంబై బీఎంసీలో తొలి సీటును గెలవడంతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 89 స్థానాలను గెలుచుకుంది. శంభాజీనగర్, మాలెగావ్ వంటి నగరాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించడమే కాకుండా.. శరద్ పవార్ ఎన్సీపీని వెనక్కి నెట్టి తన రాజకీయ శక్తిని నిరూపించుకుంది. బీఎంసీ ఎన్నికల్లో వార్డు నంబర్ 134 (మాంఖుర్డ్) పరిధిలో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మెహజబిన్ ఖాన్ విజయం సాధించారు.
బీఎంసీలో ఎంఐఎం గెలుపొందడం ఇది తొలిసారి కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలో ఎంఐఎం మొత్తం 4 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం అద్భుత ప్రదర్శన కనబరిచింది.ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఏకంగా 24 స్థానాలను కైవసం చేసుకున్న ఎంఐఎం ప్రధాన పోటీదారుగా నిలిచింది. మాలెగావ్ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 స్థానాల్లో గెలుపొంది.. తన పట్టును నిరూపించుకుంది. ధూలే మున్సిపల్ ఎన్నికల్లో 8 స్థానాలు, సోలాపూర్ ఎన్నికల్లో 8 సీట్లు, నాందేడ్‌లో 8 8 స్థానాల్లో విజయం సాధించింది.
థానేలో 5, అమరావతిలో 6 స్థానాలను ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీకి కంచుకోట అయిన నాగపూర్‌లో కూడా ఎంఐఎం 4 స్థానాలను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ ఎన్నికల ట్రెండ్స్ ప్రకారం.. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎంఐఎం సుమారు 89 స్థానాల్లో విజయం సాధించింది. ఇది శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (27 స్థానాలు) కంటే చాలా ఎక్కువ కావడం ఇప్పుడు సర్వత్రా చర్చ నీయాంశంగా మారింది. పట్టణ ఓటర్లు, ముఖ్యంగా మైనారిటీలు ఉన్న ప్రాంతాల్లో ఒవైసీ పార్టీ వైపు మొగ్గు చూపడం ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.