మెరిసే, అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఖరీదైన నూనెలను, సీరమ్ లను వాడడం, హెయిర్ ప్యాక్ లను వాడడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ చాలా మంది వారు కోరుకున్న జుట్టును పొందలేకపోతున్నారు. జుట్టు అందంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడడంతో పాటు పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు విటమిన్ బి7 ఎంతో అవసరం. దీనిని బయోటిన్ అని కూడా పిలుస్తారు. జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి ఈ విటమిన్ ఎంతో అవసరం. శరీరానికి విటమిన్ బి7 తగినంత అందినప్పుడు మాత్రమే జుట్టు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
కోడిగుడ్లు, బాదంపప్పు..

జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు జుట్టు సమస్యలు ఎక్కువగా ఉన్నవారు బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కనుక బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో గుడ్డు కూడా ఒకటి. ఇది జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుడ్డును ఉడికించి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాదంపప్పులో కూడా బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అంది జుట్టు మెరుస్తుంది. చిలగడదుంపలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో బయోటిన్ తో పాటు బీటాకెరోటీన్ సమద్దిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల తలచర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పాలకూర, చేపలు..

ఆహారంలో భాగంగా పాలకూరను తీసుకోవడం వల్ల అందమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. పాలకూరను తీసుకోవడం వల్ల బయోటిన్ తో పాటు ఐరన్ కూడా లభిస్తుంది. ఇవి జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్ చేపలను తీసుకోవడం వల్ల జుట్టు అందంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తల చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు జుట్టు మెరిసేలా చేస్తాయి. పొద్దు తిరుగుడు గింజలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. వీటిలో బయోటిన్ తో పాటు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండు కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
మటన్ లివర్, పుట్ట గొడుగులు..
ఇక అవకాడోలు కూడా పుష్కలంగా బయోటిన్ ను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యవంతమైన కొవ్వులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. మటన్ లివర్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి పుష్కలంగా బయోటిన్ లభిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జుట్టు పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. అరటిపండ్లల్లో కూడా తగిన మోతాదులో బయోటిన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. పుట్టగొడుగులు కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో బయోటిన్ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు దెబ్బతినకుండా ఉంటాయి.ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
