
హైదరాబాద్, సెప్టెంబర్ 05 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం చాలా స్వల్పమేనని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన తాజా పరిశోధన నివేదికలో వెల్లడిరచింది. ఇటీవల జీఎస్టీ మండలి తీసుకున్న రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఏటా కేవలం రూ. 3,700 కోట్ల మేరకే ఆదాయం తగ్గుతుందని అంచనా వేసింది. ఈ మొత్తం చాలా తక్కువ కావడంతో ద్రవ్య లోటుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.ఇటీవల జరిగిన 56వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% అనే నాలుగు అంచెల పన్ను విధానాన్ని రద్దు చేశారు. దీని స్థానంలో 5%, 18% అనే రెండు శ్లాబులతో పాటు కొన్ని ఎంపిక చేసిన వస్తు, సేవలపై 40% డీ`మెరిట్ రేటును ప్రవేశపెట్టారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 48,000 కోట్ల నష్టం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, ఎస్బీఐ అంచనా దీనికి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం.

ఈ సంస్కరణల వల్ల వినియోగం పెరిగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా, సామాన్యులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని తెలిపింది. దాదాపు 295 నిత్యావసర వస్తువులపై పన్ను రేటును 12% నుంచి 5% లేదా సున్నా శాతానికి తగ్గించడంతో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ (అఖఎ) ద్రవ్యోల్బణం 25 నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. 2026`27 నాటికి ద్రవ్యోల్బణం మొత్తం విూద 65 నుంచి 75 బేసిస్ పాయింట్ల మేర తగ్గుముఖం పడుతుందని వివరించింది.ఈ సంస్కరణల ఫలితంగా జీఎస్టీ సగటు భారిత రేటు కూడా గణనీయంగా తగ్గనుంది. 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు 14.4%గా ఉన్న ఈ రేటు, తాజా మార్పులతో 9.5 శాతానికి దిగి వస్తుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, వ్యయాలు తగ్గడం వల్ల బ్యాంకింగ్ రంగానికి కూడా ఈ సంస్కరణలు సానుకూల ఫలితాలనిస్తాయని అభిప్రాయపడిరది.