హైదరాబాద్, మే 23 (ఇయ్యాల తెలంగాణ) : కిడ్నీ వ్యాధిగ్రస్తులకు తెలంగాణ వైద్య రంగం మరో ఆశాకిరణంగా నిలిచింది. రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి చికిత్సల రంగంలో కీలక మైలురాయి నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆధునిక సాంకేతికత, నిపుణుల సేవలు, ప్రభుత్వ ఆరోగ్య పథకాల సహకారంతో ఈ ఘనత సాధ్యమైందని వైద్య నిపుణులు తెలిపారు.తెలంగాణలో కిడ్నీ మార్పిడి కార్యక్రమం 1989లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 2023 వరకు దాదాపు 1,500 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. అనంతరం గత మÖడున్నర నుంచి నాలుగేళ్ల వ్యవధిలోనే మరో 500 శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తవడంతో మొత్తం ట్రాన్స్‌ప్లాంట్ల సంఖ్య రెండు వేలకు చేరుకుంది. ఇది రాష్ట్ర వైద్యరంగ ప్రగతికి నిదర్శనంగా వైద్యులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌పై ఆధారపడి చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది సుమారు 500 మంది కొత్త రోగులు కిడ్నీ మార్పిడి కోసం నమోదు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్‌ప్లాంట్ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.కిడ్నీ మార్పిడి అనంతరం రోగుల ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఒక సంవత్సరం తర్వాత గ్రాఫ్ట్ సర్వైవల్ రేటు 95 శాతం, మÖడు సంవత్సరాల తర్వాత 90 శాతం, ఐదు సంవత్సరాల తర్వాత 85 శాతంగా నమోదవడం చికిత్సల విజయవంతతను ప్రతిబింబిస్తోంది. ఆరోగ్యశ్రీ, ఈహెచఎస్, జేఎచఎస్, సీఎంఆరఎఫ్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా అర్హులైన రోగులకు ఉచితంగా లేదా రాయితీపై చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నాయి.ఇక భవిష్యత్తులో రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను మరింత విస్తరించి, అత్యాధునిక వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. రాష్ట్రంలో అవయవదానంపై అవగాహన పెరగడంతో మరింత మంది రోగులకు కొత్త జీవితం అందించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.