
హైదరాబాద్, ఆగస్టు 16, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీల మధ్య కాక రేపుతుంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా అన్ని పార్టీలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో గెలిచి తమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం చెక్కు చెదరలేదని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వంపై రెండేళ్లలోనే అసంతృప్తి పెరిగిందని, అందుకు ఉప ఎన్నికల్లో గెలిచి నిరూపించాలని బీఆర్ఎస్ పార్టీ తహతహలాడుతుంది. మరొకవైపు బీజేపీ కూడా తాము రేసులో ఉన్నామని, ఈ సారి అధికార పీఠం తమదేనని తేల్చి చెప్పేందుకు ఈ ఎన్నికను రెఫరెండంగా చూడాలని కమలనాధులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే అభ్యర్థి విషయంలో స్పష్టత ఇచ్చింది. లోకల్స్ ను మాత్రమే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగంగానే ప్రకటించారు. అంటే ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలు ఇక్కడ పోటీ చేయాలన్న ఆశలు పెట్టుకోవద్దని కూడా సున్నితంగా తెలిపినట్లయింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తీవ్రంగానే ఢల్లీిలో తనకున్న లాబీయింగ్ తో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అజారుద్దీన్ ను అభ్యర్థిగా ఎంపిక చేయడం స్థానిక రాష్ట్ర నాయకత్వానికి ఇష్టం లేనట్లు కనిపిస్తుంది. అజారుద్దీన్ ప్రజలకు అందుబాటులో ఉండే నేత కాదని, అందుకే ప్రత్యామ్నాయం వైపు హస్తం పార్టీ చూస్తున్నట్లు సమాచారం. మరి హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి.. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ స్థానాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తుంది.

తమ సిట్టింగ్ స్థానం కావడంతో తిరిగి నిలుపుకుని కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని, అదే సమయంలో రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత ప్రారంభమయిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతల్లోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపాలంటే ఈ ఎన్నికలో గెలవడం ముఖ్యమని భావిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కూడా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో కీలక నేతలతో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి తదితరులతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. అయితే ఇద్దరు ముగ్గురు అభ్యర్థుల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారని, సర్వేచేయించిన అనంతరం వారిలో ఒకరికి కేటాయిస్తారని అంటున్నారు. ఇక బీజేపీ కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై నమ్మకం పెట్టుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓటుబ్యాంకుతో పాటు సినీ ప్రముఖులు ఎక్కువగా ఉండటం తమకు కలసి వచ్చే అంశంగా భావిస్తుంది. అయితే టీడీపీతో పొత్తుకు మాత్రం బీజేపీ సిద్ధపడటం లేదు. టీడీపీ, జనసేనల నుంచి లోపాయికారీ పొత్తును కుదుర్చుకుని బరిలోకి దిగి గెలవాలని బీజేపీ కూడా వ్యూహాలు రచిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టిక్కెట్ కోసం అనేక మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది కూడా ఢల్లీి స్థాయిలో తేలాల్సిన అంశం కావడంతో కొందరు కేంద్రమంత్రులు బండి సంజయ్ ద్వారా, మరికొందరు కిషన్ రెడ్డి ద్వారా, ఇంకొందరు రాజ్యసభ్యుడు కె.లక్ష్మణ్ ద్వారా లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలిసింది. మొత్తం విూద జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీల్లో హీట్ రేపుతుందని చెప్పాలి.